Delhi Protest: దేశ రాజధాని న్యూఢిల్లీ మరోసారి పూర్తి స్థాయిలో దిగ్బంధమైంది. గతంలో కరోనా సమయంలో చూసిన లాక్‌డౌన్ వాతావరణం ఇప్పుడు నగరంలో మళ్లీ కనిపిస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) జంతర్ మంతర్ వద్ద శనివారం తలపెట్టిన మహాధర్నా దేశ రాజధానిని అక్షరాలా సైనిక వలయంగా మార్చేసింది.
నిరసన ప్రదర్శనకు ఎలాంటి ముందస్తు అనుమతి లేదని స్పష్టం చేసిన ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోం శాఖ ఆదేశాలతో రాజధాని నలుమూలలా మునుపెన్నడూ లేని రీతిలో భారీ ఆంక్షలు అమలు చేశారు.
23 వేల మంది బలగాలు – స్పైక్ స్ట్రిప్స్, రాతి బారికేడ్లతో రోడ్లు బ్లాక్..
శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర హోంశాఖ ఏకంగా 221 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలతో పాటు, అదనంగా మరో 110 కంపెనీలు కలిపి మొత్తం 330కి పైగా కంపెనీలను రంగంలోకి దించింది. సీఆర్పీఎఫ్ (CRPF), ఎస్ఎస్బీ (SSB), ఐటీబీపీ (ITBP), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలకు చెందిన 23 వేల మందికి పైగా సాయుధ జవాన్లు ఢిల్లీ రోడ్లపై పహారా కాస్తున్నారు.
స్పైక్ స్ట్రిప్స్ & బారికేడ్లు..
సౌత్-ఈస్ట్ ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంతో పాటు ప్రధాన రహదారులపై వాహనాలు దూసుకురాకుండా రోడ్లపై మేకుల పట్టీలు (Spike strips), బహుళ అంచెల రాతి బారికేడ్లు ఏర్పాటు చేశారు.
హైటెక్ నిఘా..
న్యూఢిల్లీ జిల్లాను 20 ప్రత్యేక జోన్లుగా విభజించి ఉన్నతాధికారులను మోహరించారు. సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాల ద్వారా అనుమానితుల కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, యూపీ సరిహద్దులను దాదాపుగా మూసివేశారు.
మెట్రో స్టేషన్లు బంద్ – 250కి పైగా రైళ్లు రద్దు..
ఢిల్లీ పోలీసుల ఆదేశాలతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సుమారు 45 నుంచి 57 వరకు కీలక మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది.
వివిధ రాష్ట్రాల నుంచి న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రావాల్సిన 250కి పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, లోకల్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యగా నగరంలోని వైన్ షాపులను మూసివేయించారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనాన్ని, ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.
అభిజీత్ దీప్కే, ధ్రువ్ రాఠీ సహా 500 మందికి పైగా నిర్బంధం..
ఆందోళనకారులు జంతర్ మంతర్ చేరకుండా పోలీసులు వ్యూహాత్మకంగా ముందస్తు అరెస్టులకు దిగారు..
ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి:
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ దిగగానే సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే, కీలక నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు నేరుగా రన్‌వే పరిసరాల నుంచే అదుపులోకి తీసుకున్నారు.
గురుగ్రామ్‌లో ధ్రువ్ రాఠీ డిటెన్షన్:
నిరసనకు బహిరంగ మద్దతు ప్రకటించిన ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని గురుగ్రామ్ సెక్టార్-56 నివాసం నుంచి తెల్లవారుజామునే ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.ఇప్పటివరకు రాజధాని పరిసరాల్లో సుమారు 500 మందికి పైగా నిరసనకారులను పోలీసులు ముందస్తుగా నిర్బంధించారు.
శాంతియుత ప్రజాస్వామ్య నిరసనలను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉక్కుపాదంతో అణచివేస్తోందని సీజేపీ, విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా.. రాజధానిలో సాధారణ పౌరుల రక్షణ, శాంతిభద్రతల కోసమే ఈ చర్యలు చేపట్టామని ఢిల్లీ పోలీస్ విభాగం స్పష్టం చేసింది.
