Abhijeet Dipke

Abhijeet Dipke: ప్రధానికి యువత అంటే అంత భయమా?.. సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తారా?

Abhijeet Dipke: దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసుల అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు ఆయన మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలిపే పౌరులను అడ్డుకునేందుకు రాజధాని మొత్తాన్ని స్తంభింపజేయడం, ఆర్మీ, పారామిలటరీ బలగాలను మోహరించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత దేశ ప్రజలపైనే యుద్ధం చేయాలనుకుంటున్నారా?

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అసాధారణ భద్రతా చర్యలను అభిజీత్ దీప్కే తీవ్రంగా తప్పుపట్టారు. ఈ దేశ ప్రధానికి దేశ యువత, సొంత ప్రజలంటే ఎందుకు ఇంత భయం వేస్తోంది? నిరసనను అడ్డుకోవడానికి రైల్వే సర్వీసులను రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మెట్రో రైళ్ల రాకపోకలను ఎందుకు ఆపేశారు? ఇంటర్నెట్ కట్ చేసి, రోడ్లను బారికేడ్లతో మూసివేశారు” అని మండిపడ్డారు.
జమ్మూకశ్మీర్ నుంచి ఆర్మీని తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నుంచి సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలను రప్పించి మోహరించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు తమ సొంత దేశ ప్రజలపైనే యుద్ధం ప్రకటించాలనుకుంటున్నారా? జ్ఞానేష్ కుమార్ వాళ్లకు అంత ముఖ్యమైన వ్యక్తా? ఆయన కోసం సొంత ప్రజలపైకి పోలీసులను, సైన్యాన్ని ఉసిగొల్పుతారా? అంటూ నిలదీశారు.
అధికారం కోసమే ఇంత భయం – ఆర్టికల్ 19 ప్రకారం నిరసన మా హక్కు..
 
రాబోయే రోజుల్లో ప్రజలు తమకు ఓట్లు వేయరనే భయం మోదీకి పట్టుకుంది. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసమే రైళ్లలో వస్తున్న సాధారణ ప్రజలను, కార్యకర్తలను మధ్యలోనే బలవంతంగా దించేసి అరెస్టులు చేస్తున్నారు. కాలనీలు, సొసైటీల్లో అనౌన్స్‌మెంట్లు చేస్తూ ఎవరూ నిరసనలకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇళ్ల తలుపులు తట్టి ఆందోళనల్లో పాల్గొనవద్దని బెదిరిస్తున్నారు అని ఆరోపించారు.
నిరసన తెలపడం మా ప్రాథమిక హక్కు కాదా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతీ పౌరుడికి ఉంది. మేము చేయాలనుకున్నది కూడా అదే అని స్పష్టం చేశారు.
UAPA, NSA కేసులు పెట్టినా భయపడేది లేదు..
ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న వార్తలపై ఆయన ధీటుగా స్పందించారు. నన్ను డిటైన్ చేయాలన్నా, అరెస్ట్ చేయాలన్నా చేసుకోమనండి. నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నాను. నన్ను జైల్లో పెట్టినా నాకు ఎలాంటి తేడా పడదు అని తేల్చిచెప్పారు.
ఉపా (UAPA), ఎన్‌ఎస్‌ఏ (NSA) పెట్టినా పోరాటం ఆగదు..
నాపై ఉపా చట్టం పెడతారా? ఎన్‌ఎస్‌ఏ కింద కేసు నమోదు చేస్తారా? ఏం చేసినా చేసుకోమనండి. కానీ దేశంలో నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగే వరకు, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేంత వరకు మా పోరాటం ఆగదు అని అభిజీత్ దీప్కే తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన అభిజీత్ దీప్కే, ఆయన సహచరులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజధానిలో పరిణామాలు మరింత వేడెక్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *