Abhijeet Dipke Arrest: దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ నిరసనకు పిలుపునిచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) కీలక నాయకత్వంపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
దీప్కేతో పాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు అశుతోష్ రాంకా, సౌరభ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజధాని పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఫ్లైట్ దిగగానే అరెస్ట్..
జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న అభిజీత్ దీప్కే, ఆయన సహచరులను ఎయిర్పోర్టు టెర్మినల్ వద్దే నిఘా వర్గాలు, ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా అభిజీత్ దీప్కేతో పాటు అశుతోష్ రాంకా, సౌరభ్లను అదుపులోకి తీసుకున్నారు.
శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం..
పార్టీ అగ్రనేతల అరెస్టు వార్త తెలియడంతో సీజేపీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర నిరసనలకు దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
ఢిల్లీలో కొనసాగుతున్న ముమ్మర భద్రత..
ఇప్పటికే జంతర్ మంతర్ పరిసరాల్లో పోలీసులు సెక్షన్ 163 విధించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, రైళ్లలో వస్తున్న ఆందోళనకారులను మధ్యలోనే అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేనే విమానాశ్రయంలో అరెస్ట్ చేయడంతో రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
