Indian Origin Woman

Indian Origin Woman: పోలీసులంటే భయం లేదు.. నడాలో భారత సంతతి మహిళ వీరంగం..!

Indian Origin Woman: కెనడాలోని కాల్‌గరీ (Calgary) నగరంలో భారత సంతతికి చెందిన ఓ మహిళ నడిరోడ్డుపై చేసిన రచ్చ చివరకు ఆమె అరెస్టుకు దారితీసింది. పాదచారుడితో ట్రాఫిక్ వివాదంలో తలపడి, దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడి బ్యాగ్‌ను లాగుతూ దాడికి దిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డై నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. “పోలీసులకు చెబితే నాకు భయమేమీ లేదు” అంటూ సవాలు విసిరిన సదరు మహిళను.. ఘటనా స్థలానికి చేరుకున్న కాల్‌గరీ పోలీసులు నేరుగా అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

అసలేం జరిగింది? – వివాదానికి కారణం.. 

రోడ్డు దాటుతున్న ఒక పాదచారుడికి (Pedestrian) సదరు మహిళ ప్రయాణిస్తున్న కారు దారి ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం పెడెస్ట్రియన్‌కు మార్గం ఇవ్వకపోవడంతో, ఆ వ్యక్తి తన మొబైల్ ఫోన్ తీసి కారును, అక్కడి పరిస్థితిని వీడియో తీయడం మొదలుపెట్టాడు.

దీంతో ఆగ్రహించిన మహిళ కారు ప్యాసింజర్ సీటు నుంచి కిందకు దిగి అతడిపైకి దూసుకొచ్చింది. “రోడ్డుపై నడవకూడదు.. ఫుట్‌పాత్ పైకి వెళ్లి నిలబడు” అంటూ అతడిపై అరిచింది. తనను వీడియో తీయడం చట్టవిరుద్ధమని చెబుతూ అతడి చేతిలోని ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించింది.
బాధితుడు పక్కకు తప్పుకుంటున్నా ఆమె విడిచిపెట్టలేదు. అతడి వెనుక ఉన్న బ్యాక్‌ప్యాక్‌ను పట్టుకుని రోడ్డు మీదుగా బలవంతంగా ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం కలిగింది.
కారు నడుపుతున్న ఆమె భర్త కిందకు దిగి.. “సారీ బ్రదర్.. వెళ్లిపోండి” అని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మహిళ శాంతించలేదు. “నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తా” అని బాధితుడు హెచ్చరించగా, “పోలీసులకు చెబితే నాకు భయం లేదు” అంటూ మరింత రెచ్చిపోయింది.
రంగంలోకి పోలీసులు – అరెస్ట్..
వెంటనే సమాచారం అందుకున్న కాల్‌గరీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితుడు చిత్రీకరించిన ఫుటేజ్, అక్కడి సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత ఆ మహిళను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, ఆమె భర్త సరైన ఇన్సూరెన్స్ లేకుండా ఆ వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తించారని సమాచారం.

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో విపరీతంగా షేర్ అవుతోంది. పబ్లిక్ ప్రదేశాల్లో తప్పు జరుగుతున్నప్పుడు రికార్డ్ చేసే హక్కు ప్రజలకు ఉంటుందని, మహిళ ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. సహనం కోల్పోయి నేరుగా భౌతిక దాడికి దిగడం తీవ్రమైన నేరమని, పోలీసులు సత్వరమే స్పందించి సరైన చర్య తీసుకున్నారని కొనియాడుతున్నారు.
కెనడాలో వరుస ఘటనలు..
కెనడాలో భారత సంతతి మహిళలు వివాదాల్లో చిక్కుకుని అరెస్ట్ కావడం కొద్ది వారాల్లో ఇది రెండోసారి. కొద్దిరోజుల క్రితమే ‘రాజ్ తివానా’ అనే భారత సంతతి మహిళ తన అద్దెదారుడితో (Tenant) గొడవపడి అరెస్ట్ అయ్యారు. గార్డెన్‌లో బార్బెక్యూ చేసుకుంటున్న టెనెంట్‌పై ఆమె విరుచుకుపడి, తన ఆస్తిని తగలబెట్టేందుకు యత్నిస్తున్నాడంటూ గొడవ చేయడంతో ఆ వీడియోలు కూడా గతంలో నెట్టింట వైరల్ అయ్యాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *