Abhijeet Dipke

Abhijeet Dipke: దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి..!

Abhijeet Dipke: ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR)లో భారీగా అక్రమాలు జరిగాయని, ‘ఓటు చోరీ’కి బాధ్యత వహిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వచ్చే వారం తలపెట్టిన నిరసన రాజకీయంగా వేడెక్కింది. ఈ ఆందోళనను భగ్నం చేసేందుకు మహారాష్ట్ర పోలీసులు తీవ్రస్థాయిలో అణచివేత చర్యలకు దిగుతున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు.

కార్యకర్తలకు ముందస్తు నోటీసులు – ప్రయాణ ఖర్చులపై ఆరా.. 

నిరసనల్లో పాల్గొనకుండా తమ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దీప్కే ఆరోపించారు.. చంద్రాపూర్ జిల్లా బల్లార్పూర్ పరిధిలోని సీజేపీ కార్యకర్త మయూర్ మల్ఖేడే సహా పలువురికి పోలీసులు జారీ చేసిన ముందస్తు నోటీసుల ప్రతులను ఆయన మీడియాకు విడుదల చేశారు.
పోలీసుల అనుమతి లేకుండా ఢిల్లీ నిరసనల్లో పాల్గొనకూడదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, నోటీసు ఉల్లంఘిస్తే క్రిమినల్ లేదా ప్రివెంటివ్ డిటెన్షన్ చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
 
కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ పోలీసులు ఆర్థిక వనరులపై కూడా ఆరా తీస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని దీప్కే మండిపడ్డారు.

ఆందోళన హింసాత్మకమని పోలీసులకు ముందే ఎలా తెలిసింది?

పోలీసుల నోటీసుల్లోని అంశాలపై దీప్కే సూటి ప్రశ్నలు సంధించారు. “మేము రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా గాంధీ, అంబేడ్కర్ ఆశయాలతో పోరాటం చేస్తుంటే.. నిరసన హింసాత్మకంగా మారుతుందని పోలీసులకు ముందే ఎలా తెలిసింది? నిరసనను అణచివేయడానికి పోలీసులే స్వయంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?” అని నిలదీశారు. దేశంలోనే ఉత్తమ పోలీస్ వ్యవస్థగా పేరున్న మహారాష్ట్ర పోలీసులు.. నేడు ఢిల్లీ పోలీసుల్లాగా వ్యవహరించడం బాధాకరమన్నారు.

ఫడ్నవిస్.. యూపీ సీఎం యోగి 2.0 లా మారకండి!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రకు ఒక గొప్ప చారిత్రక వారసత్వం ఉంది. దేవేంద్ర ఫడ్నవిస్ సాహెబ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2.0 లాగా మారాలని చూస్తున్నారా? దయచేసి మీ వ్యక్తిగత, రాజకీయ స్వార్థం కోసం మహారాష్ట్ర పోలీస్ శాఖను అప్రతిష్టపాలు చేయకండి అని హితవు పలికారు. నేడు అధికారంలో ఉన్నవారు మహాత్మా గాంధీజీ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, ఆయన హత్యకు కారణమైన వారిని సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు.

UAPA, NSA పెట్టినా భయపడను.. ఎక్కడ ఆపితే అక్కడే జంతర్ మంతర్!

ప్రభుత్వ బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని దీప్కే స్పష్టం చేశారు. అమాయక కార్యకర్తలను వేధించడం ఆపి, దమ్ముంటే తనను జైలులో పెట్టాలని, అవసరమైతే యూఏపీఏ (UAPA) లేదా ఎన్‌ఎస్ఏ (NSA) వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని సవాల్ విసిరారు.

పోలీసులు తనను ఎక్కడ అడ్డుకుంటే ఆ ప్రదేశాన్నే తాము ‘జంతర్ మంతర్’గా మార్చేసి ధర్నా చేపడతామని, కార్యకర్తలు కూడా నిర్బంధించిన చోటే శాంతియుత ఆందోళనలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *