Israel: ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో పైలట్‌పై దాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ఘటనలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిర్దేశిత మార్గం దాటి ప్రయాణించిన ఆ విమానాన్ని ఇజ్రాయెల్ కూల్చివేయాలనుకుందట. అందుకోసం యుద్ధ విమానాలను సిద్ధం చేసిందని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
విమానాన్ని కూల్చాలనుకుని..!
దుబాయ్ (Dubai) నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన విమానం కాక్‌పిట్‌లో దాడి అనంతరం 30 సెకన్లలో 34 వేల అడుగుల ఎత్తు నుంచి 16వేల అడుగుల మేర కిందకు దూసుకొచ్చింది. అప్పటికే ఆ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్ ప్రసారం అయింది. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ (Israel)లో కలవరం మొదలైంది. విమానాన్ని హైజాక్ చేశారా..? లేక తమ దేశంపై దాడి జరగనుందా..? అని భయపడింది. ఇజ్రాయెల్ వైమానికదళం ఫ్లైదుబాయ్ విమానం (Flydubai Plane)తో కాంటాక్ట్ కోసం ప్రయత్నించగా.. కాక్‌పిట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
దీంతో అత్యవసర యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసింది. ఒక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. తన గగనతలాన్ని మూసివేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత యుద్ధ విమానాలను వెనక్కి రప్పించింది. అప్పటికే ఆ విమానం సౌదీ అరేబియా వైపు అత్యవసర ల్యాండింగ్‌కు దారి మళ్లడమే అందుకు కారణం. మరోవైపు సౌదీ కూడా యుద్ధ విమానాలను మోహరించిందని ఆ కథనం పేర్కొంది.
ఒకవేళ ఆ విమానం టెల్‌అవీవ్ (ఇజ్రాయెల్ నగరం) వైపు ప్రయాణం కొనసాగించి ఉంటే.. యుద్ధవిమానాల పైలట్లు దానికి సమీపంగా వెళ్లి, కాక్‌పిట్‌లో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారని వెల్లడించింది. అది హైజాక్ అయిందని నిర్ధరణ అయి ఉంటే.. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని, రక్షణమంత్రి దృష్టికి తీసుకెళ్లేవారని పేర్కొంది. దేశానికి ముప్పు పొంచి ఉన్న అలాంటి సమయంలో విమానాన్ని కూల్చివేయాలని ఆదేశించే అధికారం ప్రధానికి ఉండేదని తెలిపింది. కోపైలట్ ప్లాన్ ప్రకారం.. టెల్‌అవీవ్‌లోని ఎత్తైన భవనాలు, బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్ లక్ష్యమని ఇప్పటికే ఇజ్రాయెల్ దర్యాప్తు వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఫ్లైదుబాయ్‌లో చేరకముందే అటాక్ ప్లాన్..!
గాజాలో ఇజ్రాయెల్ చర్యలకు ప్రతీకారంతోనే కోపైలట్ ఇలా చేశాడని ప్రాథమికంగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అతడు టెల్‌అవీవ్‌లో విమానాన్ని కూల్చే ప్లాన్ విఫలమైతే.. ఇంకో ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జోర్డాన్‌లోని యూఎస్ సైనికస్థావరం అతడి టార్గెట్ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఒమన్ జాతీయుడైన కోపైలట్ ఈ ఏడాది ప్రారంభంలో కూడా టెల్‌అవీవ్‌కు వెళ్లిన విమానంలో విధులు నిర్వర్తించాడని, అప్పుడు విమానాన్ని హైజాక్ చేసి కూల్చివేయాలని భావించాడని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. అయితే విమానంలో తెలిసిన వ్యక్తి ఉండటంతో తర్వాత ఆ ప్లాన్‌ను విరమించుకున్నట్లు సమాచారం. అసలు ఆ దాడి ప్రణాళికలన్నీ ఫ్లైదుబాయ్ (Flydubai) సంస్థలో చేరకముందే వేసుకున్నట్లు కోపైలట్ దర్యాప్తు అధికారులకు చెప్పడం గమనార్హం.
