Operation Firewall: దేశ రక్షణ రంగాన్ని, ముఖ్యంగా భారత నావికాదళ (Indian Navy) భద్రతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ గూఢచర్య కుట్రను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (AP CI Cell) అధికారులు విజయవంతంగా ఛేదించారు. శత్రుదేశమైన పాకిస్తాన్‌కు భారత యుద్ధనౌకలు, కీలక రక్షణ రహస్యాలను చేరవేస్తున్న ముఠా ఆటకట్టించేందుకు ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ (Operation Firewall-2026) పేరిట సంచలన ఆపరేషన్ చేపట్టారు.
విశాఖపట్నం కేంద్రంగా సాగుతున్న ఈ గూఢచర్య వలయాన్ని బద్దలు కొట్టిన అధికారులు.. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న 13 మంది నావికాదళ సిబ్బంది సహా మొత్తం 18 మందిపై ఏకకాలంలో నిఘా ఉంచారు.
విశాఖ కేంద్రంగా హనీట్రాప్ వల – అసలేం జరిగింది?
భారత తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రమైన (Eastern Naval Command) విశాఖపట్నంలో విధులు నిర్వహించే నేవీ సిబ్బందిని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOs) సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు..
అమ్మాయిల పేరుతో ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లను సృష్టించి నేవీ ఉద్యోగులకు వల వేశారు. వారితో ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకుని, ప్రేమ పేరిట ఆకర్షించి అత్యంత రహస్యమైన సైనిక సమాచారాన్ని రాబట్టారు. భారత యుద్ధనౌకలు, జలాంతర్గాములు (Submarines) ఎక్కడ మోహరించారు? వాటి కదలికలు ఏమిటి? కీలక నేవీ స్థావరాల లొకేషన్లు, ఉన్నతాధికారుల సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసినట్లు గుర్తించారు.
ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా సమాచారం..
ఎవరికీ అనుమానం రాకుండా సమాచారాన్ని ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లు, సాఫ్ట్‌వేర్ల ద్వారా పాకిస్తాన్‌కు చేరవేస్తూ.. ప్రతిఫలంగా క్రిప్టోకరెన్సీ లేదా హవాలా మార్గాల్లో భారీ ఎత్తున నగదు ముడుపులు స్వీకరించినట్లు తేలింది.
రంగంలోకి ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ – 12 బృందాల మెరుపు దాడి..
డిజిటల్ కమ్యూనికేషన్లను ట్రాక్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం, ఈ సమాచార చౌర్యాన్ని పసిగట్టి కేంద్ర నిఘా సంస్థలు, నేవల్ ఇంటెలిజెన్స్‌తో కలిసి సమన్వయంతో రంగంలోకి దిగింది:
10 రాష్ట్రాల్లో విస్తృత సోదాలు..
మొత్తం 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థావరాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.
ఇద్దరి అరెస్ట్ – విచారణ ముమ్మరం..
ఈ దాడుల్లో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. కీలక నేవీ సెయిలర్ సహా ఇద్దరిని అధికారికంగా అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.
విచారణలో మరికొందరు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో 13 మంది నావికాదళ సిబ్బంది సహా 18 మంది నెట్‌వర్క్‌పై అధికారులు గట్టి నిఘా ఉంచారు. దేశ రక్షణ భద్రతకు పెను ముప్పుగా మారిన ఈ అంతర్జాతీయ స్పై నెట్‌వర్క్‌ను ఏపీ పోలీసులు సమర్థవంతంగా భగ్నం చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
