Supreme Court

Supreme Court: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు ఊరట.. సస్పెన్షన్‌కు నోటీసులిచ్చిన సుప్రీంకోర్టు తిరస్కరణ!

Supreme Court: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సోమవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు స్పష్టంగా తోసిపుచ్చింది. అయితే, ఎన్నికల సంఘం నిర్ణయాల ప్రక్రియపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ), సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన పూర్తి రికార్డులను తమ ముందుంచాలని ఈసీని ఆదేశించింది.
పిటిషనర్ల ప్రధాన ఆరోపణలు ఏమిటి?
సోషల్ యాక్టివిస్ట్ రాకేష్ కుమార్ సింగ్, అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠిలు దాఖలు చేసిన పిటిషన్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు.
ఓటర్ల జాబితా సవరణ (SIR – Special Summary Revision), కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారమ్-6 (Form-6) నిబంధనల మార్పులు, సాఫ్ట్‌వేర్ మార్పులను ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు.
‘CEC & ECs Act’ మరియు ఎన్నికల సంఘం చట్టాల ప్రకారం.. కమిషన్‌లో ఎలాంటి కీలక నిర్ణయమైనా ఏకగ్రీవంగా గానీ, లేదా కనీసం మెజారిటీ (ముగ్గురిలో ఇద్దరు) సభ్యుల ఆమోదంతో గానీ జరగాలి. కానీ మిగిలిన ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలను తొక్కిపెట్టి నిర్ణయాలు అమలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.
రిటైర్మెంట్ తర్వాత కూడా రక్షణ (ఇమ్యూనిటీ)?..
కొత్త చట్టం ప్రకారం సీఈసీకి విపరీతమైన అధికారాలు కట్టబెట్టారని, రిటైర్మెంట్ తర్వాత కూడా ఎలాంటి విచారణ జరగకుండా దేశ ప్రధానికి, చివరికి న్యాయమూర్తులకు కూడా లేని ప్రత్యేక రక్షణను కల్పించారని వికాస్ సింగ్ ఆరోపించారు.
  • పిటిషనర్ల డిమాండ్:
    సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేసి, మిగిలిన ఇద్దరు కమిషనర్లు ఎన్నికల విధులను పర్యవేక్షించేలా ఆదేశించాలని, ‘అనూప్ బరన్‌వాల్’ తీర్పు ప్రకారం సీఈసీ ఎంపిక కమిటీలో సీజేఐని భాగస్వామిగా చేసే విధానాన్ని అమలు చేయాలని కోరారు.

సుప్రీంకోర్టు స్పందన – సస్పెన్షన్‌‌కు నిరాకరణ..

వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతరంగా సీఈసీని సస్పెండ్ చేయడానికి నిరాకరించింది:
  • చట్టబద్ధంగా పనిచేస్తారని భావిస్తున్నాం:
    “రాజ్యాంగబద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘం చట్టానికి లోబడే పనిచేస్తుందని మేము విశ్వసిస్తున్నాం. కేవలం పత్రికా కథనాలను చూసి కోర్టు ఎలాంటి తొందరపాటు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు” అని సీజేఐ స్పష్టం చేశారు.
  • కౌంటర్ అఫిడవిట్‌కు ఆదేశం:
    “ముందుగా ఈసీ నుంచి సమాధానం రానివ్వండి. వారు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి. ఒకవేళ విచారణలో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే.. ఆ నిర్ణయాలను మేమే స్వయంగా రద్దు చేస్తాం” అని ధర్మాసనం తేల్చిచెప్పింది.
  • ఫారమ్-6 మార్పులపై క్లారిటీ:
    ఫారమ్-6 మార్పులను తాము ఇంకా ఆమోదించలేదని పేర్కొన్న న్యాయస్థానం.. వివాదాస్పద నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నారా? మెజారిటీతో తీసుకున్నారా? లేక సీఈసీ సొంతంగా తీసుకున్నారా? అనేది ధ్రువీకరించేందుకు పూర్తి రికార్డులను సమర్పించాలని ఈసీని ఆదేశించింది.

ఎన్నికలు పూర్తయి ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక నిర్ణయాలు రద్దు చేయడం వల్ల ఫలితం ఉండదని, అందుకే ఇప్పుడే వ్యవస్థల విశ్వసనీయత కాపాడాలని పిటిషనర్లు పదేపదే విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే సమాధానం ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *