Gen-Z: నవలల్లో కనిపించే కలల రాకుమారుడు, సినిమాల్లో కనిపించే అందమైన జంటలను చూసినప్పుడు.. “మనకు కూడా జీవితంలో ఇలాంటి పర్ఫెక్ట్ లైఫ్ పార్టనర్ దొరికితే ఎంత బాగుండు!” అని ప్రతి ఒక్కరూ అనుకోవడం సహజం. అందం, ఉద్యోగం, హోదా, మంచి గుణాలు.. ఇలా అన్నింట్లోనూ ’10కి 10 మార్కులు’ వచ్చే భాగస్వామి దొరకాలని చాలామంది కలలు కంటారు. కానీ, ప్రాక్టికల్ జీవితంలోకి వచ్చేసరికి అలాంటి 100% పర్ఫెక్ట్ మనుషులు ఉండరనేది కఠినమైన నిజం.
ఈ వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న నేటి ‘జెన్ జీ’ (Gen Z) తరం ఆలోచనా విధానంలో పెను మార్పు కనిపిస్తోంది. భాగస్వామి విషయంలో ‘పర్ఫెక్ట్’ కొలమానాల కంటే.. తమకు ‘ప్రశాంతత, మానసిక భరోసా’ ఇచ్చే వారికే నేటి యువత జై కొడుతోంది. రిలేషన్‌షిప్‌లలో వచ్చిన ఈ సరికొత్త మార్పు వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు, నిపుణుల విశ్లేషణలు ఇప్పుడు చూద్దాం!
’10కి 10′ మార్కులు కాకపోయినా పర్లేదు.. 6 లేదా 7 చాలు!..
కొంతమంది తమ జీవితంలో ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షనిజం (Perfectionism) కోరుకుంటారు. పార్టనర్‌లోనూ అన్నీ అద్భుతమైన లక్షణాలే ఉండాలని గిరిగీసుకుంటారు. తీరా పెళ్లి చేసుకున్నాక ఎదుటివారిలో చిన్న చిన్న లోపాలు కనిపించగానే సర్దుకుపోలేక, అటు విడిపోలేక తీవ్రమైన మానసిక వేదనను, ఎమోషనల్ బర్నౌట్ను అనుభవిస్తుంటారు.
ఈ తరహా మానసిక ఒత్తిళ్లు వద్దనుకుంటోంది నేటి జెన్ జీ తరం.. తాము ఎంచుకునే పార్టనర్‌కు 10కి 10 మార్కులు పడకపోయినా.. కనీసం 6 లేదా 7 మార్కులు వచ్చినా వారితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతున్నారు.
అందం, భారీ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే కూడా.. బంధానికి కట్టుబడి ఉండే నిజాయితీ (Loyalty), దయ, జాలి, కరుణ, పరస్పర నమ్మకం, క్లిష్ట సమయాల్లో చేదోడువాదోడుగా నిలిచే స్వభావం ఉంటే చాలని భావిస్తున్నారు.
జెన్ జీ తరం ఆలోచనలు ఇలా ఎందుకు మారాయి?
అన్నీ ఉండాలన్న మితిమీరిన ఆరాటం కంటే.. ఉన్న దాంట్లో సర్దుకుని సంతృప్తి పడటం మిన్న” అనే సూత్రాన్ని నేటి యువత ఫాలో అవుతోంది. అందుకు ప్రధాన కారణాలు ఇవే..
-
మూణ్నాళ్ల ముచ్చటగా మారకూడదనే ముందుచూపు..ఈ రోజుల్లో చిన్న కారణాలకే విడాకులు తీసుకోవడం, దాంపత్య బంధాలు త్వరగా విచ్ఛిన్నం కావడం ఎక్కువైంది. అలాంటి దుస్థితి తమకు రాకూడదంటే.. కేవలం పైపై మెరుగుల కంటే మనసును అర్థం చేసుకునే వ్యక్తి కావాలని భావిస్తున్నారు.
-
లోపాలు సహజమనే వాస్తవికత:ఈ లోకంలో నూటికి నూరు శాతం ఎవరూ పర్ఫెక్ట్ కారు. ఎదుటివారిలో లోపాలు వెతికే బదులు.. ఒకరి లోపాలను మరొకరు స్వీకరిస్తూ తోడుగా నిలిచే నిజమైన తోడు కోసం చూస్తున్నారు.
-
ఉరుకుల పరుగుల జీవితంలో అలసట (Burnout):జాబ్స్, కార్పొరేట్ టెన్షన్లు, వ్యక్తిగత పనులతో యువత తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇంటికి వచ్చాక కూడా గొడవలు, ఈగో క్లాషెస్ పడటం కంటే.. కనీసం ప్రశాంతంగా మాట్లాడి ఓదార్చే భాగస్వామి ఉంటే చాలని కోరుకుంటున్నారు.
ఈ మార్పు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
పర్ఫెక్షనిజం వదిలేసి, ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల జంటల మధ్య బంధం కలకాలం నిలుస్తుందని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
-
మానసిక ప్రశాంతత & పాజిటివిటీ: ఎదుటివారి నుంచి అసాధ్యమైన విషయాలను ఆశించనప్పుడు నిరాశకు తావుండదు. ఇద్దరి మధ్య పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి.
-
కలకాలం నిలిచే అనుబంధం: ఒకరినొకరు గౌరవించుకుంటూ, నమ్మకంతో ముందుకు సాగడం వల్ల బంధం మరింత దృఢపడుతుంది. ఒంటరితనం అనే మాటే దరిచేరదు.
-
లక్ష్యాలను చేరుకోవడంలో ప్రోత్సాహం: ఒకరికొకరు సపోర్ట్‌గా ఉన్నప్పుడు.. వ్యక్తిగత కెరీర్ లక్ష్యాలను, ఆశయాలను సులభంగా సాధించగలుగుతారు.
నిపుణుల కీలక సూచన.. మీరు కోరుకున్నట్లే.. ఎదుటివారూ ఆశిస్తారు!..
ఏ బంధమైనా నిలబడాలంటే ఒక వైపు ప్రయత్నం మాత్రమే సరిపోదు..
-
మీరు మీ పార్టనర్ నుంచి నిజాయితీ, అండదండలు ఎలాగైతే ఆశిస్తున్నారో.. అవతలి వారు కూడా మీ నుంచి అదే కేరింగ్, నిబద్ధతను ఆశిస్తారని గుర్తుంచుకోవాలి.
-
ఎవరితోనైనా జీవితాన్ని పంచుకునే ముందు తొందరపడకుండా.. ఇద్దరూ కలిసి కూర్చొని తమ ఆలోచనలు, భవిష్యత్ ఆశయాలపై మనసు విప్పి మాట్లాడుకోవాలి.
-
అన్ని ప్రధాన విషయాల్లో ఒక స్పష్టమైన ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే ముందడుగు వేస్తే.. ఆ వైవాహిక బంధం జీవితాంతం ఆనందంగా, తిరుగులేకుండా సాగుతుంది!
