Protest: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR), ఎన్నికల సంఘం (ECI) తీరుపై తీవ్ర నిరసనజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్కులో వేలాది మంది యువతీ యువకులతో నిర్వహించిన నిరసన ప్రదర్శన విజయవంతం కావడంతో.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా ఉన్న పౌరులతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ‘జంతర్ మంతర్ 2.0’ పేరిట మహా పాదయాత్ర, భారీ ఆందోళన చేపడతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అధికారికంగా ప్రకటించారు.
పోలీసులు ఎక్కడ ఆపితే.. అదే మాకు జంతర్ మంతర్!..
ప్రజాస్వామ్యాన్ని, పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థను కాపాడుకోవడానికి మేము శాసనోల్లంఘన స్ఫూర్తితో, గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలోనే పోరాటం సాగిస్తాం. అక్టోబర్ 10న దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత ఢిల్లీకి పాదయాత్రగా బయల్దేరనున్నారు. ఈ క్రమంలో ఒకవేళ ఢిల్లీ పోలీసులు మమ్మల్ని మార్గమధ్యంలో బారికేడ్లతో ఎక్కడ అడ్డుకుంటే.. ఆ ప్రాంతాన్నే జంతర్ మంతర్గా మార్చి రోడ్లపైనే బైఠాయిస్తాం” అని దీప్కే స్పష్టం చేశారు. పారదర్శకమైన ఓటింగ్ విధానాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ తమతో నడవాలని పిలుపునిచ్చారు.
శివాజీ పార్కులో భారీ ఉద్రిక్తత..
పోలీసులు ముందస్తు అనుమతి నిరాకరించినప్పటికీ ముంబై శివాజీ పార్కుకు వేలాదిగా యువత తరలివచ్చారు. ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా, విశాల్ దడ్లానీ వంటి ప్రముఖులు కూడా ఈ నిరసనకు సంఘీభావం తెలిపారు. ముంబైలో లభించిన భారీ ప్రజా మద్దతుతోనే ‘ఛలో ఢిల్లీ’ పిలుపునిచ్చినట్లు సీజేపీ ప్రతినిధులు తెలిపారు.
సీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే..
-
సీఈసీ రాజీనామా & క్రిమినల్ కేసులు: ఎన్నికల సవరణల్లో అక్రమాలకు పాల్పడిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే వైదొలగాలని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
-
2023 నాటి వివాదాస్పద చట్టం రద్దు: ప్రధాన న్యాయమూర్తి (CJI) పాత్ర లేకుండా ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాన్ని వెంటనే రద్దు చేసి, నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలన్నారు.
-
2025 ఓటర్ల జాబితా ఫ్రీజ్: అక్రమ మార్పులు జరిగినందున 2025 నాటి ఓటర్ల జాబితాను తాత్కాలికంగా స్తంభింపజేయాలని కోరారు.
13 కోట్ల ఓట్ల గల్లంతు – కేంద్ర అసమర్థతకు పరాకాష్ట..
గత రెండేళ్ల కాలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా ఏకంగా 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే మరియు ఇండియా కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 2 శాతంగానే ఉందని.. అధికార పక్షానికి లబ్ధి చేకూర్చేందుకే ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు హడావుడిగా జ్ఞానేశ్ కుమార్ను నియమించారని దీప్కే ఆరోపించారు. గతంలో గెలవని రాష్ట్రాల్లోనూ ఓటర్ల తొలగింపు తర్వాతే బీజేపీ గెలవగలిగిందని మండిపడ్డారు.
రెండు నెలల్లోనే మరో ఉద్యమం..
నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన తెలిపిన రెండు నెలలకే.. మళ్లీ ఓటు హక్కు కోసం రోడ్లపైకి రావాల్సి రావడం ప్రభుత్వ ఘోర అసమర్థతకు నిదర్శనమన్నారు.
హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద కూడా ఆందోళనలు..
ఈ నిరసన కేవలం ముంబై, ఢిల్లీలకే పరిమితం కాలేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పలు విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, అర్హులైన పౌరుల ఓట్లను తొలగించడంలో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిందని ప్లకార్డులతో నిరసన తెలిపారుసీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్నికల వ్యవస్థ స్వయంప్రతిపత్తిని కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేహా బోరా ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతుండగా.. అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా లక్షలాది మందితో ‘ఛలో ఢిల్లీ’ మహా పాదయాత్ర చేపడతామని సీజేపీ హెచ్చరించడంతో కేంద్ర భద్రతా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
