it-techie-loses-38-lakhs-in-stock-options-trading-addiction-revenge-trading-warning-story

Stock Market: లంచ్ బ్రేక్ లో అలవాటు.. ఏకంగా 38 లక్షలు నష్టం..!

Stock Market: నెల తిరిగేసరికి ఖాతాలో పడే రూ.2 లక్షల ఖతర్నాక్ జీతం.. అకౌంట్‌లో భద్రంగా దాచుకున్న రూ.14 లక్షల ఫిక్స్‌డ్ సేవింగ్స్.. సొంత కార్, ప్రేమగా చూసుకునే భార్య, ముద్దులొలికే పసిబిడ్డ, కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు.. ఏ లోటూ లేని ఒక సూపర్ హ్యాపీ లైఫ్ అది! కానీ, లంచ్ బ్రేక్‌లో సరదాగా మొదలైన ఒక్క తప్పుడు ఆలోచన.. రెండేళ్ల తిరిగేసరికి ఆ జీవితాన్ని నిలువునా కుప్పకూల్చింది.
షేర్ మార్కెట్‌లో నాలెడ్జ్ లేకుండా దిగి.. ఆప్షన్స్ ట్రేడింగ్ మాయలో పడి ఏకంగా రూ.38 లక్షలు పోగొట్టుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ 35 ఏళ్ల ఐటీ ఉద్యోగి విషాద గాథ ప్రస్తుతం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వేలాది మందిని ఉలిక్కిపడేలా చేస్తోంది. హేమ్‌ధర్పన్ అనే యూజర్ తన స్నేహితుడి జీవితంలో జరిగిన ఈ భయానక వాస్తవాన్ని ప్రపంచం ముందుంచుతూ పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద కనువిప్పు!
సరదాగా లంచ్ బ్రేక్‌లో మొదలై.. డోపమైన్ రష్‌తో ఎడిక్షన్‌గా మారింది!
కథ సరిగ్గా 2024లో మొదలైంది.. ఆఫీసులో లంచ్ చేస్తున్నప్పుడు పక్కనున్న కొలీగ్ తన జెరోధా (Zerodha) యాప్ ఓపెన్ చేసి చూపించాడు. “చూడు బ్రో.. జస్ట్ 45 నిమిషాల్లో నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్‌‌లో రూ.12,000 ప్రాఫిట్ వచ్చింది. రోజులు, నెలలు స్టాక్స్ హోల్డ్ చేయాల్సిన పనేలేదు.. ఇంట్రాడేలో జస్ట్ 10-15 పాయింట్లు పట్టుకుంటే క్షణాల్లో వేలు సంపాదించొచ్చు” అని ఊరించాడు.
కొలీగ్ మాటలు నమ్మి మనోడు కూడా అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. మొదటి కొన్ని రోజుల్లోనే కేవలం 2 గంటల్లో ఏకంగా రూ.18,000 లాభం చూశాడు. ఆ క్షణంలో మెదడులో కలిగిన కిక్ (Dopamine Rush) మామూలుది కాదు! దాంతో రోజంతా కష్టపడి చేసే 9 టు 5 సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగం చాలా స్లోగా, టైమ్ వేస్ట్‌లా అనిపించడం మొదలైంది. ఇక అక్కడి నుంచే పతనం మొదలైంది.
రివెంజ్ ట్రేడింగ్.. స్టాప్‌లాస్ పెట్టకపోవడం చేసిన మొదటి తప్పు!
ట్రేడింగ్ మొదలుపెట్టిన రెండో నెలలోనే మార్కెట్ తన అసలైన విశ్వరూపాన్ని చూపించింది.. స్టాప్‌లాస్ (Stop-Loss) పెట్టుకోకపోవడం వల్ల ఒక్క ట్రేడ్‌‌లోనే నిమిషాల వ్యవధిలో రూ.50,000 నష్టపోయాడు.
 
సాధారణంగా నష్టాన్ని అంగీకరించి తప్పు సరిదిద్దుకోవాలి. కానీ అతడు మార్కెట్‌పై రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. పోయిన రూ.50 వేలు ఎలాగైనా రికవర్ చేయాలనే మొండి పట్టుదలతో కుటుంబ సేవింగ్స్ నుంచి మరో లక్ష రూపాయలు తెచ్చి పెట్టాడు.
రోజుకు 30 నుంచి 40 ట్రేడ్లు..
రివెంజ్ ట్రేడింగ్ మొదలయ్యాక చార్టులు, టెక్నికల్ అనాలిసిస్ అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. కాసినోలో స్లాట్ మెషిన్ ముందు కూర్చున్న జూదరిలా స్క్రీన్ మీద పడే నంబర్లనే చూస్తూ రోజుకు 30 నుంచి 40 ట్రేడ్లు కొట్టేవాడు. ఏదో ఒక ట్రేడ్‌లో ప్రాఫిట్ వచ్చినా.. బ్రోకరేజ్, ఎస్టీటీ, ట్రాన్సాక్షన్ ఛార్జీలకే ఆ లాభం మొత్తం తుడిచిపెట్టుకుపోయేది.
రూ.14 లక్షల సేవింగ్స్ ఖాళీ.. బాత్రూమ్‌లలో దాక్కుని స్క్రీన్ వాచింగ్!
2024లో మొదలైన ఈ వ్యసనం 2025 మధ్య నాటికి అతడి అకౌంట్‌లోని సొంత కష్టార్జితం రూ.14 లక్షలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. అయినా అతడిలో మార్పు రాలేదు.. పైగా దొంగలా మారాడు..
స్క్రీన్ టైమ్‌ను ఇంట్లో భార్య చూడకుండా దాచేవాడు. ఆఫీస్ టైమ్‌లో సైతం బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని గంటల తరబడి కూర్చుని ఆప్షన్ గ్రీక్స్, మార్జిన్ కాల్స్, ఓపెన్ పొజిషన్స్ చూస్తూ గడిపేవాడు.
సేవింగ్స్ అయిపోవడంతో ఇల్లు రిపేర్ చేయిస్తున్నానని అబద్ధం చెప్పి మూడు వేర్వేరు బ్యాంకుల నుంచి ఏకంగా రూ.24 లక్షల పర్సనల్ లోన్లు తీసుకున్నాడు.
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ బుట్టలో..
బ్యాంకు డబ్బులు కూడా మార్కెట్లో ఆవిరైపోవడంతో.. చివరకు ప్రమాదకరమైన ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ నుంచి కూడా అప్పులు చేయడం మొదలుపెట్టాడు. “ఎక్స్‌పైరీ డే (Expiry Day) రోజు ఒక్క పెద్ద ర్యాలీ పట్టుకుంటే చాలు.. పోయిన అప్పులన్నీ ఒక్క దెబ్బతో క్లియర్ అయిపోతాయి” అనే గుడ్డి భ్రమలోనే బతికాడు.
గుమ్మం ముందు రికవరీ ఏజెంట్లు.. రోడ్డున పడ్డ కుటుంబం!
చివరకు 2025 చివర్లో ఊహించని పెద్ద భూకంపం వచ్చింది.. ఈఎంఐలు కట్టకపోవడంతో లోన్ రికవరీ ఏజెంట్లు నేరుగా ఇంటి గుమ్మం ముందుకు వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు గానీ కుటుంబానికి అసలు నిజం తెలియలేదు.
స్కూల్ ఫీజుల చెక్కు బౌన్స్..
అప్పటికే బిడ్డ స్కూల్ ఫీజు కట్టిన చెక్కు కూడా బౌన్స్ అయింది. మొత్తం లెక్క తీస్తే.. చేతిలో ఉన్న రూ.14 లక్షల సేవింగ్స్ పోవడమే కాకుండా, మరో రూ.24 లక్షల అప్పు నెత్తిన పడింది. అంటే మొత్తం రూ.38 లక్షల నష్టం!
మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు జీవితాంతం పైసా పైసా కూడబెట్టిన సంపాదన మొత్తం కొడుకు వ్యసనం వల్ల బూడిదలో పోసిన పన్నీరైంది. నమ్మించి మోసం చేశాడన్న ఆవేదనతో, మానసిక క్షోభ తట్టుకోలేక భార్య పసిపిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ టెక్కీ జీతం మొత్తం బ్యాంక్ రికవరీలకు కట్ అయిపోతోంది. తన కార్‌ను అమ్మేసి, లోన్ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ నెమ్మదిగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ట్రేడర్లు గుర్తుంచుకోవాల్సిన కఠిన పాఠాలు (Hard Realities)..
ఈ ఉదంతం ద్వారా హేమ్‌ధర్పన్ ప్రతి ఒక్కరికీ ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
  1. మార్కెట్‌కు భావోద్వేగాలు ఉండవు:
    మీకు అప్పులు తీర్చాల్సిన అవసరం ఉందనో, మీ కుటుంబం రోడ్డున పడుతుందనో మార్కెట్ కనికరించదు. మార్కెట్‌తో పంతాలకు పోతే సర్వనాశనం ఖాయం.
  2. ఆప్షన్స్ ట్రేడింగ్ నూటికి 90% మందికి ఉచ్చు:
    సెబీ (SEBI) నివేదికలు కూడా చెబుతున్న చేదు నిజం ఏంటంటే.. ఎఫ్ అండ్ ఓ (F&O) ట్రేడింగ్ చేసే 100 మందిలో 93 మంది నష్టాల పాలవుతున్నారు. ఇతరుల ప్రాఫిట్ స్క్రీన్‌షాట్లు చూసి ఎప్పుడూ మోసపోకండి.
  3. స్టాప్‌లాస్ లేకపోతే బరిలోకి దిగొద్దు:
    ట్రేడింగ్‌లో అతిపెద్ద నియమం స్టాప్‌లాస్ గౌరవించడం. నష్టాన్ని భరించలేక రివెంజ్ ట్రేడింగ్ చేస్తే అది వ్యసనంగా మారి జూదంలా మారుతుంది.
  4. ఆగండి.. వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి:

    ఒకవేళ మీరు కూడా ఇలాంటి మానసిక ఊబిలో చిక్కుకుంటే.. వెంటనే ట్రేడింగ్ అకౌంట్లను క్లోజ్ చేసి, యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేసి కుటుంబ సభ్యులకు నిజం చెప్పి మానసిక నిపుణుల సాయం తీసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *