World Cup 2027 Schedule: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అతిపెద్ద సంబరానికి సమయం ఆసన్నమైంది. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. సరిగ్గా ఏడాది కౌంట్‌డౌన్ మొదలవడంతో పాటు టికెట్ల కేటాయింపు ప్రక్రియకు కూడా ఐసీసీ పచ్చజెండా ఊపింది.
ఈసారి మెగా టోర్నీని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొత్తం 14 జట్లు పాల్గొంటున్న ఈ మహా సంగ్రామంలో 12 వేదికల్లో ఏకంగా 57 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 2న (గాంధీ జయంతి) మొదలయ్యే ఈ పోరు నవంబర్ 21న జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది.
ఈసారి కొత్త ఫార్మాట్ – ‘సూపర్ సిక్స్’ కాదు.. ‘సూపర్ సెవెన్స్’!
గతంలో ఉన్న ఫార్మాట్లకు భిన్నంగా ఐసీసీ ఈసారి సరికొత్త లెక్కను తీసుకొచ్చింది..
-
నమీబియాలో సూపర్ సిరీస్ (అక్టోబర్ 2):అర్హత సాధించిన 14 జట్లలో అత్యల్ప ర్యాంకింగ్ ఉన్న చివరి 3 జట్ల మధ్య నమీబియాలో రౌండ్ రాబిన్ పద్ధతిలో ముందుగా మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో టాప్‌లో నిలిచిన ఒక జట్టు మెయిన్ గ్రూప్ స్టేజ్‌కు అర్హత సాధిస్తుంది.
-
రెండు గ్రూపులు – 12 జట్లు:డైరెక్ట్ ఎంట్రీ పొందిన మిగతా జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
-
కొత్తగా ‘సూపర్ 7’ (Super Sevens) స్టేజ్:గ్రూప్ దశ ముగిసిన తర్వాత సెమీఫైనలిస్టులను తేల్చేందుకు ‘సూపర్ 7’ దశను ప్రవేశపెట్టారు.
-
టీమిండియాకు ‘A1’ సీడింగ్ ఫిక్స్:గ్రూప్ దశలో భారత్ ఏ స్థానంలో నిలిచినా సరే.. టోర్నీ సీడింగ్స్ ప్రకారం భారత్‌ను ‘A1’ గానే పరిగణిస్తారు. ఒకవేళ ఏ జట్టైనా టీమిండియాను నాకౌట్ చేస్తే ఆ జట్టు A1 స్థానాన్ని తీసుకుంటుంది.
గ్రూపుల వివరాలు: భారత్-పాక్ ఒకే గ్రూప్‌లో!
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌లు రెండూ ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకోవడంతో టోర్నీ ప్రారంభం నుంచే అసలైన కిక్ మొదలుకానుంది.
-
గ్రూప్ A:భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్, క్వాలిఫయర్ A.
-
గ్రూప్ B:దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ B.
ఆస్ట్రేలియాతో మొదలు.. పాకిస్తాన్‌తో పోరు:
టీమిండియా తన తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. 2023 ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవడానికి భారత్‌కు ఇది సరైన అవకాశం. అంతేకాదు, గతంలో 2003లో దక్షిణాఫ్రికా వేదికగా వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా ఫైనల్లో భారత్-ఆసీస్ జట్లే తలపడ్డాయి. ఆ తర్వాత కేవలం మూడు రోజుల గ్యాప్‌లోనే దాయాది పాకిస్తాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
గ్రూప్ దశలో భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు)..
-
అక్టోబర్ 7: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (న్యూలాండ్స్, కేప్‌టౌన్)
-
అక్టోబర్ 10: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (వాండరర్స్, జొహన్నెస్‌బర్గ్)
-
అక్టోబర్ 14: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ (ట్ష్వానే / ప్రిటోరియా)
-
అక్టోబర్ 17: భారత్ వర్సెస్ క్వాలిఫయర్ A (బ్లూమ్ఫోంటెయిన్)
-
అక్టోబర్ 24: భారత్ వర్సెస్ జింబాబ్వే (విక్టోరియా ఫాల్స్)
భారత్ vs పాకిస్తాన్.. ఒకే టోర్నీలో 3 సార్లు తలపడే ఛాన్స్!
ఈ కొత్త ‘సూపర్ 7’ ఫార్మాట్ వల్ల భారత్-పాక్ మ్యాచ్‌లు ఒక్కటితోనే ఆగవు.
-
మొదటిసారి: గ్రూప్ దశలో అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్‌లో.
-
రెండోసారి: రెండు జట్లు క్వాలిఫై అయితే.. సూపర్ 7 దశలో నవంబర్ 7న కేప్‌టౌన్‌లో మరోసారి ఢీకొంటాయి.
-
మూడోసారి: నాకౌట్ దశలో ఇరు జట్లు రాణిస్తే సెమీఫైనల్ లేదా ఫైనల్లో ముఖాముఖి తలపడే గోల్డెన్ ఛాన్స్ ఉంది.
సూపర్ 7 దశలో భారత్ సంభావ్య మ్యాచ్‌ల షెడ్యూల్ (మధ్యాహ్నం 1:30 గంటలకు)..
-
అక్టోబర్ 28: A1 vs A2 (భారత్ vs ఆస్ట్రేలియా) – ట్ష్వానే
-
అక్టోబర్ 31: B2 vs A1 (దక్షిణాఫ్రికా vs భారత్) – జొహన్నెస్‌బర్గ్
-
నవంబర్ 4: A1 vs B1 (భారత్ vs న్యూజిలాండ్) – పార్ల్
-
నవంబర్ 7: A1 vs A3 (భారత్ vs పాకిస్తాన్) – కేప్‌టౌన్
-
నవంబర్ 10: A1 vs AB4 (భారత్ vs TBD) – గ్కెబెర్హా (పోర్ట్ ఎలిజబెత్)
-
నవంబర్ 14: A1 vs B3 (భారత్ vs ఇంగ్లండ్) – డర్బన్
నాకౌట్ మ్యాచ్‌ల వేదికలు..
-
నవంబర్ 17: మొదటి సెమీఫైనల్ (కేప్‌టౌన్)
-
నవంబర్ 18: రెండో సెమీఫైనల్ (ట్ష్వానే)
-
నవంబర్ 21: గ్రాండ్ ఫైనల్ (వాండరర్స్, జొహన్నెస్‌బర్గ్)
దక్షిణాఫ్రికాలోని ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్‌లపై జరగనున్న ఈ వన్డే ప్రపంచ సమరంలో రోహిత్ శర్మ సేన 2003, 2023 చేదు జ్ఞాపకాలను చెరిపేసి ట్రోఫీని ముద్దాడుతుందో లేదో చూడాలి!
