Harish Rao

Harish Rao: కాంగ్రెస్ నేతలకు భోజనం పెట్టి నా భూములు నేనే చూపిస్తా

Harish Rao: సిద్ధిపేట జిల్లాలో భూ ఆరోపణల పేరిట పర్యటనకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ సీనియర్ నేత, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. శుక్రవారం సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తన భూములు చూడటానికి వస్తున్న కాంగ్రెస్ నేతలకు తానే స్వయంగా దగ్గరుండి భోజనం పెట్టి, తన తోటలు, భూములు చూపిస్తానని స్పష్టం చేశారు. అయితే చూసిన తర్వాత వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పాలని, ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు.

నా జీవితం తెరిచిన పుస్తకం – అఫిడవిట్లలో అంతా ఉంది..

తన జీవితం తెరిచిన పుస్తకమని, ప్రతి ఎన్నికల్లోనూ తన ఆస్తుల వివరాలన్నింటినీ అఫిడవిట్లలో పారదర్శకంగా వెల్లడించానని హరీశ్‌ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతల్లాగా తాను ఎప్పుడూ కబ్జాలు చేయలేదని, ప్రజల భూములను అక్రమంగా దోచుకోలేదని మండిపడ్డారు. తన నిబద్ధత, అభివృద్ధి పనులను చూసే సిద్ధిపేట ప్రజలు ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించారని తెలిపారు.
భూమి చూడటానికి 3 వేల మంది పోలీసులు ఎందుకు?

కాంగ్రెస్ నాయకులు సిద్ధిపేటకు వస్తే మూడు జిల్లాల నుంచి దాదాపు 3 వేల మంది పోలీసులను ఎందుకు రప్పిస్తున్నారని నిలదీశారు. సాధారణ పరిశీలనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇంతటి భారీ పోలీసు బలగాలు ఎందుకని ప్రశ్నించారు. “నా భూములు చూడటానికి వారు ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. సిద్ధిపేటకు వస్తే మర్యాదగా భోజనం పెట్టి, నా భూములను, తోటలను నేనే దగ్గరుండి చూపిస్తా. కానీ ప్రజల ముందు గోబెల్స్ ప్రచారం చేయవద్దు” అని హరీశ్‌ రావు తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *