Ganesh Nimajjanam: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. ‘సూపర్ ఎల్నినో’ ప్రభావంతో గత ఆరు నెలలుగా చినుకు జాడ లేకపోవడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు పూర్తిగా అడుగంటి నెర్రెలు బారాయి. సాధారణంగా వినాయక చవితి పండుగ వేళ ఊరూరా కోలాహలంగా పూజలు నిర్వహించి, జలాశయాలు లేదా చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే, నిమజ్జనం చేయడానికి గుక్కెడు నీరు కూడా లేకపోవడంతో ఎండిపోయిన చెరువుల నడిబొడ్డునే మట్టి విగ్రహాలను ఉంచి నిమజ్జన క్రతువును ముగించాల్సిన దయనీయ పరిస్థితి దాపురించింది. ఈ దృశ్యాలు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
ఆశగా ఎదురుచూసినా మొహం చాటేసిన వరుణుడు..
తాగునీరు, సాగునీరు కరవై బోర్లు సైతం ఎండిపోతుండటంతో పశువుల మేతకు, సాధారణ జీవనానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల్లో తట్టాబుట్టా సర్దుకుని ఇతర ప్రాంతాలకు పొట్టకూటి కోసం వలసలు వెళ్లడం తప్ప మరో మార్గం లేదని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
