Siddipet: రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా 10 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
చెరువును తలపించిన బస్టాండ్ – ప్రయాణికుల పాట్లు..
హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణతో పాటు ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాల్లోకి కూడా వరద నీరు భారీగా చేరింది. మోకాలి లోతు వరకు నీరు నిలవడంతో బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగి బస్టాండ్‌లోకి రావడంతో దుర్వాసన, మురుగునీటి మధ్యే ప్రయాణికులు గడపాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, వృద్ధులు నడవలేక నానా తంటాలు పడ్డారు.
రంగంలోకి దిగిన అధికారులు – సహాయక చర్యలు ముమ్మరం..
బస్టాండ్ జలమయమైన సమాచారం అందుకున్న వెంటనే స్థానిక మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది.. మున్సిపల్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు.
మున్సిపల్ సిబ్బంది వెంటనే మోటార్లు, డ్రైనేజీ పూడికతీత పరికరాలతో రంగంలోకి దిగి నిలిచిన వరద నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు.ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా బస్టాండ్ పరిసరాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
