Jayaho BC: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ బహిరంగ సభ విజయవంతమైంది. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపేందుకు అనకాపల్లి ఎంపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ఈ భారీ సభను ఏర్పాటు చేశారు.
ఈ సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌లతో పాటు పలువురు బీసీ నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన బీసీ శ్రేణులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
రాజకీయాల్లోకి నన్ను తెచ్చింది ఎన్టీఆరే.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు
సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రసంగిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని, టీడీపీతో బీసీలకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు:
1983లో దివంగత నందమూరి తారకరామారావు తనను పిలిచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడిగారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, స్థానిక తంగేటి రాజులకు ఎదురొడ్డి తాను నిలబడలేనని చెప్పినప్పుడు.. ‘నీకు నేను అండగా ఉంటాను, ధైర్యంగా పోటీ చేయి’ అని ఎన్టీఆర్ భరోసా ఇచ్చారని, ఆ మాటతోనే బరిలోకి దిగి గెలిచానని అయ్యన్న తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల్లో 137 కులాలు ఉన్నాయని, రాష్ట్రంలో ఏకంగా 57 శాతం బీసీ ఓటర్లే ఉన్నారని చెప్పారు. బీసీల సంక్షేమాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజం..
గత ఐదేళ్ల పాలనలో జగన్ ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు మెగా డీఎస్సీ ద్వారా వేలాది టీచర్ ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ధైర్యమున్నా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని, రోడ్లపై నిలబడి మాట్లాడటం ఏంటని సూటిగా ప్రశ్నించారు. “అసెంబ్లీకి వచ్చి మాట్లాడటానికి జగన్‌కు భయం ఎందుకు? ప్రజలు కేవలం 11 సీట్లు ఇస్తే.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది” అని ఎద్దేవా చేశారు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు – పోలవరం పూర్తి..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు కలను నిజం చేస్తున్నారని, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తారని అయ్యన్నపాత్రుడు ధీమా వ్యక్తం చేశారు.
