Viral News

Viral News: ఐఫోన్ ఆర్డర్ పెడితే.. బొమ్మ ఫోన్ వచ్చింది..!

Viral News: ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌కు బులంద్‌షహర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాకిచ్చింది. అసలైన ఆపిల్ ఐఫోన్ 14 ప్రో కోసం రూ.1.43 లక్షలకు పైగా చెల్లించిన కస్టమర్‌కు నకిలీ చైనా ఫోన్ పంపించడమే కాకుండా, బాధితుడు చేసిన ఫిర్యాదులను ఏకంగా ఐదుసార్లు నిర్లక్ష్యంగా తిరస్కరించినందుకు గాను ఫ్లిప్‌కార్ట్‌పై భారీ జరిమానా విధించింది. వినియోగదారుడికి పూర్తి సొమ్మును వడ్డీతో సహా వాపస్ చేయడంతో పాటు, మానసిక వేదన, కోర్టు ఖర్చుల కింద అదనంగా రూ.30 వేలు కలిపి మొత్తం దాదాపు రూ.1.70 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

డెలివరీ ఏజెంట్ ఫోన్‌తోనే తీసిన వీడియో – బయటపడ్డ నకిలీ ఫోన్..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా అనూప్‌షహర్‌కు చెందిన ఓం ప్రకాశ్ సింగ్ అనే కస్టమర్ 2023 మే 29న ఫ్లిప్‌కార్ట్‌లో క్రెడిట్ కార్డు ద్వారా రూ.1,43,335 చెల్లించి ‘డీప్ పర్పుల్’ వేరియంట్ ఐఫోన్ 14 ప్రోను ఆర్డర్ చేశారు.
న్యూఢిల్లీ ఆర్.కె.పురం అడ్రస్‌కు పార్శిల్ డెలివరీ కాగా, స్వయంగా డెలివరీ బాయ్ ఫోన్‌తోనే అన్‌బాక్సింగ్ వీడియో తీసి వాట్సాప్‌లో పంపించారు. అసలైన ఐఫోన్ 14 ప్రో వెనుక 3 కెమెరాలు ఉండాల్సి ఉండగా, బాక్స్ లోపల నకిలీ ఆపిల్ లోగోతో కేవలం 2 కెమెరాలు మాత్రమే ఉన్న ఆకుపచ్చ రంగు చైనా స్మార్ట్‌ఫోన్ బయటపడింది.
ఐదుసార్లు రిటర్న్ రిక్వెస్ట్ రద్దు – లీగల్ నోటీసు కూడా తిరస్కరణ..
ఈ మోసంపై వెంటనే స్పందించిన బాధితుడు ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో రిటర్న్ రిక్వెస్ట్ పెట్టగా సెల్లార్ రద్దు చేశాడు. దీంతో ఏకంగా 5 సార్లు వేర్వేరుగా రిటర్న్ రిక్వెస్ట్‌లు పెట్టినా.. కస్టమర్ కేర్ ప్రతినిధులు కనీసం ఫోన్‌ను భౌతికంగా తనిఖీ చేయకుండానే ‘ఉత్పత్తి డ్యామేజ్ అయ్యింది’ అని రాస్తూ రిక్వెస్ట్‌లను తిరస్కరించారు. టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసినా ఫలితం దక్కలేదు.
దీంతో విసిగిపోయిన బాధితుడు 2023 జూలై 5న న్యాయవాది ద్వారా ఫ్లిప్‌కార్ట్‌కు లీగల్ నోటీసు పంపగా, “షాప్ నంబర్ లేదు” అనే రిమార్క్‌తో ఆ పోస్టల్ నోటీసు కూడా వెనక్కి వచ్చేసింది. దీంతో గత్యంతరం లేక బాధితుడు 2023 ఆగస్టు 3న బులంద్‌షహర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
మేం కేవలం మధ్యవర్తులం మాత్రమే” అన్న ఫ్లిప్‌కార్ట్ వాదన చెల్లదు..
విచారణ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ తనను తాను సమర్థించుకుంటూ వింత వాదనలు తెరపైకి తెచ్చింది.. తాము కేవలం కొనుగోలుదారుడికి, థర్డ్ పార్టీ సెల్లార్‌కు మధ్యవర్తిగా ఉండే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ మాత్రమేనని, అసలు విక్రేత కాదని పేర్కొంది.ఓపెన్ బాక్స్ డెలివరీ సదుపాయం ఉందని, ఫోన్ నకిలీదని తేలితే అప్పుడే తిరస్కరించాల్సిందని, డెలివరీ తీసుకున్న తర్వాత కంపెనీ బాధ్యత వహించదని వాదించింది.
కమిషన్ ప్రెసిడెంట్ హస్నైన్ ఖురేషి, సభ్యురాలు నీలం కుమారి ఈ వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆర్డర్ రికార్డులు, డెలివరీ ఏజెంట్ సమక్షంలో తీసిన అన్‌బాక్సింగ్ వీడియో, ఫోటోలను పరిశీలించిన కమిషన్.. అసలైన ఐఫోన్ ధరను పూర్తిగా వసూలు చేసి నకిలీ పరికరాన్ని పంపడం ముమ్మాటికీ తీవ్ర సేవా లోపం, నిర్లక్ష్యం మరియు అనుచిత వ్యాపార పద్ధతేనని తేల్చిచెప్పింది.
కోర్టు విధించిన పూర్తి పరిహారం వివరాలు..
  1. పూర్తి మొత్తం వాపస్: కస్టమర్ నుంచి ఆ నకిలీ చైనా ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వెనక్కి తీసుకుని, ఆయన చెల్లించిన రూ.1,43,335 మొత్తాన్ని కేసు దాఖలు చేసిన తేదీ (3 ఆగస్టు 2023) నుంచి 7 శాతం వార్షిక వడ్డీతో సహా చెల్లించాలి.
  2. మానసిక క్షోభకు పరిహారం: కస్టమర్‌ను పదేపదే తిప్పుతూ తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.20,000 పరిహారం చెల్లించాలి.
  3. కోర్టు ఖర్చులు: న్యాయపోరాటానికి అయిన ఖర్చుల కింద రూ.10,000 అందించాలి.
  4. 45 రోజుల డెడ్‌లైన్: ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని, ఒకవేళ గడువులోగా చెల్లించకపోతే బకాయి మొత్తంపై 8 శాతం వార్షిక వడ్డీ వర్తిస్తుందని కమిషన్ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *