KTR

KTR: రాహుల్ గాంధీకి ఒక రూల్.. మాకో రూలా? ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ!

KTR: తెలంగాణ శాసనసభ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విడుదల అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోలీసుల వెనుక ఉండి ఈ దౌర్జన్యాన్ని నడిపించారని ఆరోపించారు. తాము ఎలాంటి అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించలేదని, స్పీకర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్సీ తాతా మధు ఎలాంటి అసభ్య పదజాలం మాట్లాడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీకి ఒక న్యాయం.. మాకొక న్యాయమా?

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలుపుతున్నప్పుడు లేని అభ్యంతరం.. తాము అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తే ఎందుకు వస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. “రాహుల్ గాంధీకి ఒక రూల్.. మాకు ఇంకో రూల్ ఉంటుందా? ఏ చట్టం లేదా నిబంధన ప్రకారం మమ్మల్ని గేటు వద్ద అడ్డుకున్నారో పోలీసులకు కనీస సమాధానం కూడా లేదు” అని మండిపడ్డారు.
1000 రోజుల వైఫల్యాలపై ప్రశ్న..

 

100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను ప్రభుత్వం ఏర్పాటై 1000 రోజులు సమీపిస్తున్నా నెరవేర్చలేదని, ఈ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రతిపక్షాన్ని అడ్డుకుందని విమర్శించారు.
ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ.. మహిళా ఎమ్మెల్యేల పట్ల దౌర్జన్యంపై ఆగ్రహం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో వైఎస్సార్, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అలాగే మాజీ మంత్రి కోవా లక్ష్మి లాంటి సౌమ్యుల పట్ల పోలీసులు కిరాతకంగా ప్రవర్తించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి రాకముందే వారు ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు.
చీర లాగి.. కన్నీరు పెట్టించారు..
“గత 25 ఏళ్లుగా అపార రాజకీయ అనుభవం ఉన్న సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టి లాగి, ఇనుప గ్రిల్స్‌పై పడేసేంత దారుణంగా పోలీసులు ప్రవర్తించారు. ఒక మహిళా ఎమ్మెల్యే కంటతడి పెట్టే దుస్థితిని తెచ్చారు. ఇది చట్టసభ కాదు.. ముమ్మాటికీ దుశ్శాసన సభగా మార్చేశారు” అంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటనకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పీకర్ తీరుపై అభ్యంతరం – న్యాయం కోసం పోరాటం..
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానంలో కూర్చున్నవారు అధికార, ప్రతిపక్ష సభ్యుల పట్ల పక్షపాతం లేకుండా వ్యవహరించాలని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ కట్ చేస్తాననడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.
పోలీసులపై చర్యలు చేపట్టాలి:
శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న ప్రజాప్రతినిధులపై దౌర్జన్యానికి పాల్పడి, మహిళా నేతలను గాయపరిచిన బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభలో తమకు కేటాయించిన సమయాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *