Vijaysai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి తీవ్ర ప్రకంపనలు సృష్టించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో టీడీపీ ‘రెడ్‌బుక్’ పార్టీగా, వైసీపీ ‘రప్పారప్పా’ పార్టీగా మారిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత 15 ఏళ్లుగా ఈ రెండు కుటుంబ పార్టీల ఫ్యాక్షన్ రాజకీయాల మధ్య ఏపీ ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, రాష్ట్రానికి బలమైన మూడో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక తక్షణావసరమని స్పష్టం చేశారు.
ప్రజలకు గోరంత.. వాళ్లకు కొండంత
“టీడీపీ, వైసీపీ రెండూ కుటుంబ రాజకీయ పార్టీలే. ప్రజలకు గోరంత ఇచ్చి.. తమ ఖాతాల్లోకి కొండంత నింపుకోవడమే ఈ రెండు పార్టీల విధానం. ఏపీలో ఎవరు ఏ పని చేయాలన్నా వీరికి మామూళ్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది” అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
గత పన్నెండేళ్ల కాలంలో రెండు పార్టీల హయాంలో కలిపి ఏకంగా రూ.12 లక్షల కోట్ల అప్పు చేశారని, ఆ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆయన నిలదీశారు. ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేస్తూ అభివృద్ధిని పూర్తిగా కుంటుపరిచారని మండిపడ్డారు.
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు – బాల్‌థాకరే తరహాలో మెంటర్ పాత్ర..
“ఏపీలో రాబోయే కొత్త పార్టీకి నేను సీఎం అభ్యర్థిని కాను. బాల్‌థాకరే తరహాలో పార్టీకి ఒక మెంటర్‌గా మార్గదర్శనం చేస్తానే తప్ప, నా కుటుంబ సభ్యులు ఎవరూ పార్టీలో ఎలాంటి పదవుల్లోనూ ఉండరు” అని స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని కేవలం రెండు కుటుంబాలు, రెండు కులాలే (రెడ్లు, కమ్మలు) పాలించాలా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇతర వర్గాలు, ముఖ్యంగా ఎంతోమంది సామర్థ్యం కలిగిన బీసీ నేతలు ఉన్నారని, వారెందుకు సీఎంలు కాకూడదని నిలదీశారు. తమ పార్టీలో చేరే వారికి ప్రధానంగా ‘దేశభక్తి’ ప్రాథమిక అర్హతగా ఉంటుందన్నారు. తాను గత రెండేళ్లుగా రాజకీయంగా సైలెంట్‌గా ఏమీ లేనని, క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు.
అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నా..
తాను అమరావతికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా అందరూ అంగీకరించాలని, అక్కడికి పెద్దఎత్తున ప్రైవేట్ కంపెనీలను, పెట్టుబడులను తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రధాన పార్టీల వైఖరిని ఎండగడుతూ విజయసాయిరెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు, కొత్త పార్టీ ఏర్పాటు సంకేతాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
