KTR: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘జెన్‌జీ’ (Gen-Z) యువతతో నిర్వహించిన ముఖాముఖి సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా నిరుద్యోగులను, విద్యార్థులను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయని నిలదీస్తూ, యువత ఆగ్రహం ముందు ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.
ఒక్క మంత్రిని కాదు.. ప్రజలు కాంగ్రెస్‌నే బర్తరఫ్ చేస్తారు
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ పరిణామాలు, ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే నాథుడే లేడు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం మీకు దండంపెట్టిన చేతులే.. రేపు మోసపోయామని తెలిశాక కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండాలు పెడతాయి. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు, త్వరలోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికే బర్తరఫ్ ఆర్డర్ ఇవ్వబోతున్నారు. తెలంగాణను సాధించి నిలబెట్టిన కేసీఆర్ రాజీనామా చేయాలా? లేక వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని హెచ్చరించారు.
యువతకు రేవంత్ ఓ లెక్కనా?
జెన్‌జీ యువతరం నడుం బిగిస్తే దేశ ప్రధాని మోదీ అంతటి నాయకుడే వణికిపోయారు. అలాంటిది ఈ రేవంత్ రెడ్డి మన యువతకు ఓ లెక్కనా? నాడు ఎన్నికల ముందు అశోక్‌నగర్ వచ్చి ‘యూత్ డిక్లరేషన్’ అని ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు దాన్ని ‘బూత్ డిక్లరేషన్’గా మార్చేసింది. రాహుల్ గాంధీ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి నెలకోసారి వెళ్లే మూటలు చూసుకుని ఆయన నోరు మూసుకున్నారు.
ఉద్యోగాల శ్వేతపత్రంపై చర్చకు సిద్ధమా?
వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే. పాత నోటిఫికేషన్లు, రీ-నోటిఫికేషన్లు తీసేస్తే వాళ్లు కొత్తగా ఇచ్చింది 10 వేల ఉద్యోగాలు కూడా లేవు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు తీసుకొచ్చి, పారదర్శకంగా 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఉద్యోగాల భర్తీపై సీఎం ఒక మాట, మంత్రులు ఇంకో మాట మాట్లాడుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల శ్వేతపత్రంపై నాతో చర్చకు రావాలి.
చదువుకున్న పిల్లలంటే రేవంత్‌కు అసూయ!
ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు కనీస నైపుణ్యాలు లేవని సీఎం రేవంత్ హేళన చేస్తున్నారు. కానీ చదువుకున్న యువతను చూస్తే ఆయనకు ఓర్వలేనితనం. విద్యార్థులు అడుగుతున్నారు.. ‘అసలు రాష్ట్రాన్ని పాలించే స్కిల్ మా ముఖ్యమంత్రికి ఉందా?’ అని. ఫీజు రీయింబర్స్మెంట్ అందక కాలేజీలు మూతపడుతుంటే, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోంది” అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసి, యువత గొంతుకై పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
