Volkswagen Layoffs

Volkswagen Layoffs: ఫోక్స్‌వ్యాగన్ కీలక నిర్ణయం.. లక్ష మంది ఉద్యోగాలు పోయినాటే..!

Volkswagen Layoffs: నిన్న మొన్నటి వరకు సాఫ్ట్‌వేర్ రంగంలో వినిపించిన ‘లేఆఫ్స్’ ప్రకంపనలు ఇప్పుడు ప్రపంచ కార్ల తయారీ రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు మారుపేరుగా నిలిచిన తయారీ పరిశ్రమలో ఇప్పుడు గందరగోళం మొదలైంది. జర్మనీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోక్స్‌వ్యాగన్’ (Volkswagen) తన చరిత్రలోనే కనివినీ ఎరుగని భారీ పునర్వ్యవస్థీకరణకు(layoffs) నడుం బిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఒక లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇది యావత్ గ్లోబల్ ఆటో రంగంలోనే అతిపెద్ద లేఆఫ్స్‌గా రికార్డులకెక్కుతోంది.
ఒక్కసారిగా ఎందుకు ఈ సంక్షోభం?
ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో కేవలం ఆ పేరిట వచ్చే కార్లే కాకుండా ఆడి (Audi), పోర్షే (Porsche) వంటి 10 అగ్రశ్రేణి బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో దాదాపు 6.5 లక్షల మంది పనిచేస్తుండగా, తాజా నిర్ణయంతో దాదాపు 15 శాతం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికే ప్రకటించిన 50 వేల మంది కోతకు అదనంగా మరో 50 వేల మందిని కూడా తీసేయాలని నిర్ణయించారు.
  • చైనా కంపెనీల నుంచి తీవ్ర పోటీ: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో చైనా కంపెనీలు తక్కువ ధరలకే నాణ్యమైన వాహనాలు అందిస్తూ ఫోక్స్‌వ్యాగన్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. చైనాలో కంపెనీ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.
  • ఎలక్ట్రిక్ వాహనాల (EV) మందగమనం: ఈవీలకు ఆశించిన స్థాయిలో మార్కెట్లో డిమాండ్ పెరగకపోవడం, భారీ పెట్టుబడులు పెట్టిన కంపెనీకి తలనొప్పిగా మారింది.
  • యూఎస్ సుంకాలు & ఖర్చులు: అమెరికా దిగుమతి సుంకాలు పెంచడం, యూరప్‌లో అవసరానికి మించిన ఉత్పత్తి సామర్థ్యం కంపెనీపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపాయి.
సొంత గడ్డపైనే ఫ్యాక్టరీల మూసివేత భయం!
ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. కంపెనీ పుట్టిన జర్మనీలోనే మొదటిసారి కొన్ని కీలక కర్మాగారాలు మూతపడే ప్రమాదం ఉంది. హన్నోవర్, ఎమ్డెన్, జ్వికావు, నెక్కర్‌సుల్మ్ ప్రాంతాల్లోని నాలుగు ప్లాంట్ల భవిష్యత్తుకు పూర్తి హామీ ఇవ్వలేమని యాజమాన్యం స్పష్టం చేసింది.
“ఈ ప్లాంట్ గనుక నిజంగా మూతపడితే, మా ప్రాంత భవిష్యత్తే అంధకారంలో పడిపోతుంది. ఇక్కడి ప్లాంట్, దానిపై ఆధారపడిన వేలాది అనుబంధ ఉద్యోగాలు, విడిభాగాల తయారీదారులు.. ఇవన్నీ మా ప్రాంతానికి జీవనాధారం” అని 2012 నుంచి జ్వికావు ప్లాంట్‌లో పనిచేస్తున్న మార్టిన్ లెహ్మాన్ అనే ఉద్యోగి తన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2009లో జనరల్ మోటార్స్ దివాలా తీసినప్పుడు చేసిన 50 వేల ఉద్యోగాల కోత కంటే ఇది రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
లాభాల బాట కోసం కొత్త ప్రణాళిక
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేయడం తప్పడం లేదని కంపెనీ సీఈఓ ఒలివర్ బ్లూమ్ తెలిపారు. లాభాలు అందించని వాహనాల మోడల్స్‌ను పూర్తిగా నిలిపివేసి, ఎక్కువ డిమాండ్ మరియు మార్జిన్ ఉన్న మోడళ్లపైనే పూర్తి దృష్టి పెట్టాలని సంస్థ భావిస్తోంది. బోర్డులో కార్మిక సంఘాలకు ఉన్న అధికార పరిమితులపై తీవ్ర వాదోపవాదాలు నడిచినప్పటికీ, సంస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఇరువర్గాలు చివరకు ఒక ఒప్పందానికి వచ్చాయి.
కేవలం కార్ల తయారీ కంపెనీకే పరిమితం కాకుండా, లక్షలాది కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం చూపే ఈ పెను మార్పు రాబోయే రోజుల్లో సాంప్రదాయ తయారీ రంగం ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతోందో చెప్పకనే చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *