GSLV-F17

GSLV-F17: భారత నిఘా వ్యవస్థకు కొత్త బలం.. ఇస్రో EOS-05 ప్రయోగం విజయవంతం!

GSLV-F17: ఈరోజు (సెప్టెంబర్ 4) తెల్లవారుజామున సరిగ్గా 2:55 గంటలు సమయం దేశమంతా గాఢ నిద్రలో మునిగిపోయిన వేళ.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట తీరంలో మాత్రం వాతావరణం ఉత్కంఠతో నిండిపోయింది. నిద్రలేని కళ్లు, పెరుగుతున్న గుండెచప్పుడు, ఒత్తిడితో కూడిన నిరీక్షణ. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ రూములు, ట్రాకింగ్ కేంద్రాల్లో సుమారు 16,500 మంది ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రాణాలు బిగబట్టి స్క్రీన్ల వైపు చూస్తున్నారు.

సరిగ్గా 19 నిమిషాలు గడిచిన తర్వాత సరిగ్గా  తెల్లవారుజామున 3:14 గంటలు. ఒక్కసారిగా కంట్రోల్ రూమ్ హర్షధ్వానాలతో మార్మోగిపోయింది! అలసిపోయిన ముఖాల్లో చిరునవ్వులు విరబూశాయి. శాస్త్రవేత్తలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కరచాలనం చేసుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. అత్యంత ఆధునిక భూపరిశీలన ఉపగ్రహం ‘EOS-05’ను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఇస్రో సాధించిన ఈ విజయం కేవలం మరో రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు. వరుస ఎదురుదెబ్బలతో నిరాశలో ఉన్న భారత అంతరిక్ష రంగానికి ఒక సరికొత్త ఊపిరి. నమ్మకమైన వర్క్‌హార్స్ లాంటి PSLV రాకెట్ వరుసగా రెండుసార్లు విఫలమై, దర్యాప్తు కోసం గ్రౌండ్ అయిన క్లిష్ట సమయంలో ఈ బాధ్యత జీఎస్‌ఎల్‌వీ పైనే పడింది.
ఇస్రో వర్గాల్లో ముద్దుగా.. కాస్త భయంతోనూ “నాటీ బాయ్” (చిలిపి పిల్లోడు) అని పిలుచుకునే GSLV Mk II చరిత్ర అంత తేలికైనది కాదు. గత 19 ప్రయోగాల్లో ఆరు వైఫల్యాలను చూసిన రాకెట్ ఇది. కానీ ఈ వైఫల్యాల వెనుక భారత స్వావలంబన, ఆత్మగౌరవ పోరాటం దాగుంది.
1990ల తొలినాళ్లలో భారీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మనకు క్రయోజెనిక్ సాంకేతికత అత్యవసరమైంది. రష్యా నుంచి ఆ టెక్నాలజీ తీసుకోవాలని భారత్ ప్రయత్నించినప్పుడు, అగ్రరాజ్యాల ఆంక్షలు ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేశాయి. “భారత్ రాకెట్లను కొనుక్కోవచ్చేమో గానీ, సొంతంగా తయారు చేయడం నేర్చుకోకూడదు” అనేదే ఆ ఆంక్షల అసలు సారాంశం.
ఆ అవమానమే మన శాస్త్రవేత్తల్లో అగ్నిని రాజేసింది. ఏకంగా 20 ఏళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమించి, క్లిష్టమైన స్వదేశీ క్రయోజెనిక్ టెక్నాలజీపై పట్టు సాధించారు. ఎన్నో వైఫల్యాలు, నిరాశలను అధిగమించి నేడు GSLVని ఇస్రో కిరీటంలో కలికితురాయిగా నిలబెట్టారు.
నెరవేరిన అసంపూర్ణ కల.. ‘ఈవోఎస్-05’ ప్రత్యేకత ఏమిటి?
ఈ విజయానికి ఒక భావోద్వేగ కోణం ఉంది. 2021 ఆగస్టులో ఆకాశం నుంచి నిరంతరం దేశాన్ని కాపాడే “కంటి” లాంటి GISAT-1 ఉపగ్రహాన్ని పంపినప్పుడు, క్రయోజెనిక్ దశలో లోపం తలెత్తి మిషన్ విఫలమైంది. ఇప్పుడు విజయవంతమైన EOS-05.. నాడు మిగిలిపోయిన ఆ అసంపూర్ణ కలకు నిజరూపం!
సాధారణంగా భూపరిశీలన ఉపగ్రహాలు భూమికి దగ్గరగా తిరుగుతూ, ఏదైనా ప్రాంతం మీదుగా వెళ్లినప్పుడు మాత్రమే ఫోటోలు (స్నాప్‌షాట్లు) తీస్తాయి. కానీ దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్ కక్ష్యలో ఉండే ఈ 2,376 కిలోల EOS-05 మాత్రం ఫోటోలు కాకుండా నిరంతరంగా వీడియోని చూపిస్తుంది.
  • నిరంతర నిఘా: భారత ఉపఖండం, సరిహద్దులు, పొరుగున ఉన్న సముద్ర జలాలను 24 గంటలూ పర్యవేక్షిస్తుంది.
  • విపత్తు నిర్వహణ: బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు, ఆకస్మిక వరదలు, అడవుల్లో కార్చిచ్చులను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పసిగడుతుంది.
  • రక్షణ రంగానికి కొండంత అండ: దేశ సరిహద్దు భద్రత, తీరప్రాంత పర్యవేక్షణకు ఇది రక్షణ దళాలకు తిరుగులేని “నింగి నేత్రం”గా నిలవనుంది. అందుకే ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి ఇండియన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు కూడా శ్రీహరికోటకు తరలివచ్చారు.

కష్టపడితే వచ్చే బహుమతి.. మళ్లీ పనే!

యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ డి.కె. సింగ్ ఈ ఉపగ్రహాన్ని దేశానికి మరో ‘ఐ ఇన్ ది స్కై’గా అభివర్ణించగా, కేంద్ర సైన్స్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దీనిని భారత్ అంతరిక్ష రంగంలో వేసిన మరో భారీ ముందడుగుగా కొనియాడారు. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ తమ సంస్థ ఆలోచనా విధానాన్ని ఒక్క మాటలో చెప్పారు..
“కష్టపడి పనిచేస్తే వచ్చే అసలైన బహుమతి.. మళ్లీ మరింత పనే!”
నిజమే.. సంబరాలకు ఇస్రో వద్ద ఎక్కువ సమయం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలు లైన్లో ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, భారతీయులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే చారిత్రక ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి మానవరహిత ప్రయోగం ఈ ఏడాది చివరి నాటికి జరగాల్సి ఉంది.
సెప్టెంబర్ 4న తెల్లవారుజామున దేశం మేల్కొనే సమయానికే.. నింగిలో మన దేశ భద్రతకు కాపలా కాసే మరో కాంతి నేత్రాన్ని భారత శాస్త్రవేత్తలు సగర్వంగా ప్రతిష్టించారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *