ACB Raids 

ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.. కల్తీ నెయ్యి కేసు లింకులతో ఏసీబీ మెరుపు దాడి!

ACB Raids: తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న అధికారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కడం తీవ్ర సంచలనం రేపుతోంది. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు సాగిన సుదీర్ఘ సోదాల అనంతరం, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన్ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కల్తీ నెయ్యి దర్యాప్తులో బయటపడ్డ డొంక
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ సిట్ (SIT) ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే, దర్యాప్తు సందర్భంగా ఆలయంలోని కీలక విభాగాల్లో పనిచేసిన పలువురు అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (PA) చిన్నఅప్పన్న విచారణలో వెల్లడైన కీలక అంశాల ఆధారంగానే లోకనాథంపై అనుమానాలు బలపడ్డాయి. ఆ సమయంలో కొందరు ఉద్యోగుల ఆదాయం, ఆస్తుల వ్యవహారాలపై సీబీఐ సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏసీబీకి కూడా పంపింది. ఆ సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ, పక్కా ఆధారాలతో లోకనాథంపై కేసు నమోదు చేసి సోదాలు ప్రారంభించింది.
బయటపడ్డ రూ. కోట్ల ఆస్తులు.. కిలోల కొద్దీ బంగారం
బుధవారం ఉదయం నుంచే తిరుపతి, తిరుమలలోని లోకనాథం నివాసం, కార్యాలయం, అలాగే ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున అక్రమాస్తులు వెలుగుచూశాయి.. అయన ఇంట్లో సుమారు 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, అలాగే రూ.12 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దింతో పాటూ మార్కెట్ విలువ ప్రకారం సుమారు ₹5 కోట్లకు పైగా విలువైన ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. తిరుపతి శ్రీనివాసనగర్‌లో ఒక ఫ్లాట్, గొల్లవానిగుంటలో రెండు ఇళ్లు, వడమాలపేట మండలం పాదిరేడు పరిధిలో మరో ఇల్లు, ఇతర స్థలాలను లోకనాథంతో పాటు ఆయన భార్య, కుమారుడి పేరిట కొనుగోలు చేసినట్లు గుర్తించారు. లోకనాథం, ఆయన కుమారుడి పేరిట నాలుగు పెద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

 

కారుణ్య నియామకం నుంచి కీలక పీఠం దాకా..
1989 ఫిబ్రవరి 1న లోకనాథం కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కారుణ్య నియామకం (Compassionate appointment) కింద టీటీడీలో ఒక సాధారణ జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఈవోగా పదోన్నతులు సాధిస్తూ ఎదిగారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వర్తించిన ఆయన, ఏప్రిల్ 2023 నుంచి తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు.
గతేడాది ఆయన్ను గోవిందరాజస్వామి ఆలయానికి బదిలీ చేసినప్పటికీ, రాజకీయ కారణాలు, ఆరోపణల నేపథ్యంలో ఆ బదిలీ తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఆయన తిరుమలలోనే కొనసాగుతూ వచ్చారు. తిరుమలలోని బీ-టైప్ క్వార్టర్స్‌లో ఆయన గదిని కూడా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మరికొందరి మెడకు ఉచ్చు బిగిసే అవకాశం!
భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం నాణ్యతను పక్కన పెట్టారు? అనే కోణంలో ఇప్పటికే దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. లోకనాథం అరెస్ట్‌తో ఈ వ్యవహారంలో పరోక్షంగా లబ్ధి పొందిన, అక్రమాలకు సహకరించిన మరికొందరు టీటీడీ అధికారుల జాబితా కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఉంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడటంపై భక్తులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *