Chiranjeevi

Chiranjeevi: సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ బర్త్‌డే విషెస్..

Chiranjeevi: అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా ఒకరిపై ఒకరికి ఉన్న అమితమైన ప్రేమ, గౌరవాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చిరంజీవి తన తమ్ముడిని ఉద్దేశించి రాసిన భావోద్వేగ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ చిరంజీవి చేసిన ఈ ప్రత్యేక పోస్ట్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ బాల్యపు రోజులు, ప్రజాసేవపై ఆయనకు ఉన్న తపన, రాజకీయాల్లో ఆయన సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ చిరంజీవి రాసిన ఆప్యాయత నిండిన మాటలు ఇక్కడ చూద్దాం..

చిన్నప్పటి నుంచే ప్రజల కోసం తపన – చిరంజీవి ప్రశంసలు..

“నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి.. ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు” అని చిరంజీవి కొనియాడారు.మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపుతాడని.. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తాడని తెలిపారు.

డిప్యూటీ సీఎంగా అంకితభావం – పిఠాపురం ప్రజల అదృష్టం..

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం పవన్ అంకితభావంతో పనిచేస్తున్నారని చిరంజీవి ప్రశంసించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతూ అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు.తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కేవలం ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడని కొనియాడారు.

ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలి

తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ.. “మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని చిరంజీవి తన ప్రేమను చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *