Nag Ashwin: పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘కల్కి 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సీక్వెల్ రిలీజ్ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన తాజా అప్‌డేట్ ప్రకారం సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం 10 రోజులు మాత్రమే షూటింగ్ జరిగిందని, అందులోనూ ప్రభాస్ లేని సన్నివేశాలనే చిత్రీకరించామని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు.
ప్రభాస్ ప్రాధాన్యతలు – ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ లైనప్..
కల్కి-2 షూటింగ్ ఆలస్యమవడానికి ప్రధాన కారణం ప్రభాస్ చేతిలో ఉన్న ఇతర క్రేజీ ప్రాజెక్టులే. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా ‘ఫౌజీ’ షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడంపై ప్రభాస్ దృష్టి సారించారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మూవీ టీమ్ రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తోంది.
తర్వాత ‘స్పిరిట్’..
‘ఫౌజీ’ పూర్తి కాగానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’ సెట్స్‌లోకి ప్రభాస్ అడుగుపెట్టనున్నారు. వచ్చే ఏడాది మార్చి 5కి ఎలాగైనా ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రెండు సినిమాల తర్వాతే కల్కి-2..
ఇప్పుడు ఆయన చేస్తున్న రెండు సినిమా జానర్లు వేరువేరు కావడంతో లుక్స్ డిఫరెన్స్ రాకుండా ఉండడానికే ఒకే సమయంలో రెండు సినిమాలు చేయకుండా ఒకదాని తర్వాత ఇంకోటి చేస్తున్నారు. ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ పూర్తయిన తర్వాతే ఆయన కల్కి-2 కోసం కాల్‌షీట్లు కేటాయించనున్నారు.
వేగంగా ప్రీ-ప్రొడక్షన్ – 2028 ద్వితీయార్థంలోనే విడుదల?
కల్కి-2 ఆలస్యమవుతున్నప్పటికీ మూవీ టీమ్ మాత్రం ఎలాంటి ఆందోళన చెందడం లేదు. హడావుడిగా షూటింగ్ మొదలుపెట్టడం కంటే, భారీ ప్రీ-ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకుని సెట్స్‌పైకి వెళ్లాలని చిత్ర బృందం భావిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల కాల్‌షీట్లను కూడా అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే.. పూర్తి స్థాయి రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమైతే, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పూర్తి చేసుకుని కల్కి-2 థియేటర్లలోకి రావడానికి 2028 సమ్మర్‌లో వచ్చే అవకాశం ఉంది.
