Love Birds

Love Birds: జీవితాంతం ఒకరికొకరం తోడుగా.. ఇండస్ట్రీ లో కొత్త ప్రేమ జంట..!

Kaala Bhairava and Kavya Kalyanram: తెలుగు సినీ, సంగీత వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు అధికారిక ముగింపు పడింది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ మరియు కథానాయిక కావ్య కల్యాణ్‌రామ్ తమ ప్రేమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను వెల్లడిస్తూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కావ్యతో తనకున్న అనుబంధాన్ని, ప్రేమను ప్రకృతి అందాలతో పోలుస్తూ కాలభైరవ ఎంతో కవితాత్మకంగా రాసుకొచ్చిన తీరు సినీ ప్రియులను, అభిమానులను కట్టిపడేస్తోంది.

ఆమెతో ఉంటే సొంత గూటికి చేరినట్లుంటుంది – కాలభైరవ భావోద్వేగ పోస్ట్

“నీతో సమయం గడపడం కొండల మధ్య కూర్చొని సెలయేటి ప్రవాహాన్ని చూస్తున్నంత ప్రశాంతంగా ఉంటుంది. నీతో కలిసి చేసే ప్రతి చిన్న పని కూడా ముగిసిపోకూడదనిపించే ఒక అందమైన విహారయాత్రలా అనిపిస్తుంది. చలికాలపు పొద్దున ఇష్టమైన వేడి కాఫీని ఆస్వాదిస్తే ఎంతటి హాయి లభిస్తుందో, నీతో మాట్లాడే మాటలు నా మనసుకు అంతే సాంత్వననిస్తాయి” అని కాలభైరవ పేర్కొన్నారు.
“మొదట్లో ఈ అనుభూతికి ఏ పేరు పెట్టాలో అర్థం కాలేదు. కానీ ప్రయాణంలో ఓ విషయం స్పష్టమైంది. ఆ భావనకు ఉన్న ఏకైక పేరు ‘ఇల్లు’ (Home). నిన్ను తొలిసారి కలిసినప్పుడు ఏదో కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదు.. ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న నా స్వంత గూటికి చేరుకున్న భావన కలిగింది. ఆ క్షణం నుంచి ఆ గూటిని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు” అంటూ తన మనసులోని లోతైన ప్రేమను వ్యక్తం చేశారు.
జీవితాంతం ఒకరికొకరం అండగా, ఒకరికొకరం నివాసమై (హోమ్) కలిసి ప్రయాణం సాగించబోతున్నామనే విషయాన్ని అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

సినీ ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలు..

తెలుగు ఇండస్ట్రీలో ప్రతిభావంతుడైన సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ.. ‘గంగోత్రి’ వంటి సినిమాలతో బాలనటిగా పరిచయమై, ‘మసూద’, ‘బలగం’ సినిమాలతో కథానాయికగా మెప్పించిన కావ్య కల్యాణ్‌రామ్ జంట చూడముచ్చటగా ఉందంటూ పలువురు టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *