TG: 

TG: 1,000 రోజుల పాలన నివేదిక.. రైతులకు రూ.1.68 లక్షల కోట్లు, 72 వేల ఉద్యోగాల భర్తీ..!

TG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన 1,000 రోజుల (32 నెలల) పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సమగ్ర ప్రగతి నివేదికను విడుదల చేసింది. సంక్షేమ పథకాల అమలుతో పాటు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం, భవిష్యత్ మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పాలన సాగించామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ వెయ్యి రోజుల్లో వ్యవసాయం, సంక్షేమం, ఉద్యోగ నియామకాలు, పారిశ్రామికాభివృద్ధి రంగాల్లో సాధించిన కీలక మైలురాళ్లను ప్రభుత్వం నివేదికలో విశ్లేషించింది.

వ్యవసాయం & రైతు సంక్షేమానికి అగ్రతాంబూలం..
  • రూ.1.68 లక్షల కోట్ల సాగు వ్యయం: 32 నెలల వ్యవధిలో వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏకంగా రూ.1.68 లక్షల కోట్లు వెచ్చించింది.
  • రూ.2 లక్షల రుణమాఫీ: రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ పథకం ద్వారా 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు నేరుగా రుణ విముక్తి కల్పించింది.
  • రైతు భరోసా & బోనస్: రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.36 వేల కోట్లకు పైగా నిధులు జమ చేయడంతో పాటు, సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించింది. గతేడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 81.12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి పంజాబ్‌ను అధిగమించింది.

ప్రజా సంక్షేమం & గ్యారెంటీల అమలు..

  • మహాలక్ష్మి పథకం: మహిళలకు 335 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించి, వారికి రూ.11,000 కోట్ల ప్రయాణ ఖర్చులను ఆదా చేసింది.
  • గృహజ్యోతి & గ్యాస్ సబ్సిడీ: 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (జీరో కరెంట్ బిల్లులు), 43 లక్షల లబ్ధిదారులకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తోంది.
  • సన్నబియ్యం & రేషన్ కార్డులు: కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసి, రాష్ట్రవ్యాప్తంగా 3.38 కోట్ల మందికి రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేపట్టింది.
  • డ్వాక్రా సంఘాల బలోపేతం: మహిళా సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ అందించడంతో పాటు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను మహిళలకే అప్పగించింది.
  • ఇందిరమ్మ ఇండ్లు & పెన్షన్లు: తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నగరంలో లక్ష ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టింది. కొత్తగా 2.25 లక్షల పింఛన్లు ఇవ్వడంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 43 లక్షలకు చేరింది.

కొలువుల భర్తీ – సామాజిక న్యాయం..

  • 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు: తొలి 1,000 రోజుల్లోనే పారదర్శకంగా 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది.
  • చారిత్రక సంస్కరణలు: దేశంలోనే తొలిసారిగా సమగ్ర కుల గణన సర్వే నిర్వహించడంతో పాటు 59 ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చింది.

వైద్యం, విద్య & భవిష్యత్ ప్రాజెక్టులు..

  • ఆరోగ్యం & మౌలిక వసతులు: ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. సీఎం సహాయనిధి ద్వారా రూ.2,526 కోట్ల సాయం అందించింది. రూ.2,700 కోట్లతో నూతన ఉస్మానియా ఆసుపత్రి, అల్వాల్, సనత్‌నగర్, ఎల్బీనగర్‌లలో 3 టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.
  • విద్యా ప్రమాణాలు: విద్యా ప్రమాణాల్లో రాష్ట్రం 28వ ర్యాంకు నుంచి 18వ స్థానానికి చేరింది. 105 సమీకృత గురుకుల పాఠశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ, 122 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC) ఏర్పాటు చేసింది.
  • భవిష్యత్ తెలంగాణకు పునాదులు: 360 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు (RRR), 122.9 కి.మీ. మేర 7 కారిడార్లతో మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవం, దేశంలోనే తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టులు శరవేగంగా సాగుతున్నాయి.
  • ఆర్థిక ప్రగతి: రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి పెరిగి జాతీయ సగటు కంటే 91% ముందంజలో నిలవగా.. గ్లోబల్ సమ్మిట్ల ద్వారా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల జీఎస్‌డీపీ లక్ష్యంగా రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *