MEA: నేపాల్‌లో భోటేకోశీ నది సృష్టించిన ఆకస్మిక వరద విధ్వంసంలో 288 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయాయని (ఆచూకీ లభించలేదని) భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం అధికారికంగా ప్రకటించింది. వీరిలో కైలాస మానససరోవర యాత్రికులు, త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టు కార్మికులు మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్, మొబైల్ నెట్‌వర్క్‌లు పూర్తిగా దెబ్బతినడం వల్లే వీరితో సంప్రదింపులు జరపడం కష్టంగా మారిందని, అయితే సంబంధాలు తెగిపోయిన వారంతా గల్లంతైనట్లు భావించలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రాల వారీగా వివరాలు – MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడి..
-
త్రిశూలి-1 హైడ్రోపవర్ ప్రాజెక్ట్: ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న 73 మంది భారతీయ కార్మికులతో సంబంధాలు తెగిపోయాయి.
-
తమిళనాడు (86 మంది): కైలాస యాత్రకు వెళ్లిన రెండు వేర్వేరు బృందాల్లోని 37 మంది, 49 మంది యాత్రికుల సమాచారం తెలియాల్సి ఉంది (మరో 21 మంది సురక్షితంగా రక్షించబడ్డారు).
-
కేరళ: యాత్రకు వెళ్లిన 33 మంది భక్తులు.
-
పశ్చిమ బెంగాల్: రసువా జిల్లా టిమురే ప్రాంతంలో బస చేసిన 32 మంది పర్యాటకులు.
-
ఇతర రాష్ట్రాలు: రిచా టూర్స్ ద్వారా ప్రయాణమైన మరో 61 మంది భారతీయులు.
21 మంది సురక్షితం – భారత్‌కు తరలింపు..
-
రక్షించబడిన యాత్రికులు: తీవ్ర విపత్తు నుంచి రక్షించబడిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులను భారత ఎంబసీ పర్యవేక్షణలో క్షేమంగా స్వదేశానికి తీసుకొస్తున్నారు.
-
టిబెట్‌లో చిక్కుకున్న వారికి సాయం: టిబెట్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన సుమారు 200 మంది భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా, వారి రక్షణ కోసం చైనా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.
సహాయక చర్యల్లో భారత్ ముందంజ..
-
ద్వైపాక్షిక మద్దతు: విపత్కర సమయంలో నేపాల్‌కు భారత్ పూర్తి అండగా నిలుస్తుందని, అవసరమైతే SAARC, BIMSTEC వేదికల ద్వారా కూడా అత్యవసర మానవతా సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది.
-
ఎయిర్‌లిఫ్ట్ & సహాయక సామగ్రి: ప్రత్యేక విమానాల్లో ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు, అత్యవసర వైద్య సామాగ్రిని కాఠ్మాండుకు పంపించి స్థానిక ఆర్మీతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కాఠ్మాండులోని భారత ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లు..
-
+977 985 131 6807
-
+977 970 910 7500
