Karumuri

Karumuri: ఏపీ లిక్కర్ స్కామ్‌లో రూ.18.09 కోట్ల దోపిడీ.. ఈడీ రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..

Karumuri: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ కీలక సూత్రధారులుగా వ్యవహరించి భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో కారుమూరిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా ఈడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో దాదాపు రూ.18.09 కోట్ల అక్రమ సొమ్మును మనీలాండరింగ్ చేసినట్లు ఈడీ ఆధారాలతో సహా నిర్ధారించింది.
కేసుకు రూ.13 చొప్పున దోపిడీ – షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు: 

 

  • రవాణా ఛార్జీల పెంపుతో లూటీ: గతంలో జిల్లా స్థాయిలో కిలోమీటరుకు రూ.19.68 ఉన్న మద్యం రవాణా ఛార్జీలను ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా రూ.32.53కు పెంచారు. తద్వారా ప్రతి మద్యం కేసుపై కిలోమీటరుకు రూ.13 చొప్పున అదనంగా ప్రజాధనాన్ని దోచుకున్నారు.
  • ముసుగు సంస్థ ‘సుదర్శన్ కన్‌స్ట్రక్షన్’: ఈ రవాణా కాంట్రాక్టును ‘సిగ్మా’ సంస్థకు కట్టబెట్టి, ఆ తర్వాత కారుమూరి తన బినామీ సంస్థ అయిన ‘సుదర్శన్ కన్‌స్ట్రక్షన్’ పేరిట సబ్‌-కాంట్రాక్ట్ తీసుకున్నారు. వచ్చిన లాభాల్లో 85 శాతం కారుమూరి కుటుంబానికి, 15 శాతం సంస్థకు వెళ్లేలా లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు.
  • నెలకు రూ.50-60 లక్షల కమీషన్లు: కాంట్రాక్టు ఇప్పించినందుకు రాజ్ కేసీరెడ్డికి ప్రతినెలా రూ.50 నుంచి రూ.60 లక్షల వరకు ముడుపులు చెల్లించి ముఠా సభ్యుల మధ్య పంచుకున్నట్లు తేలింది.

కుటుంబ ఖాతాల్లోకి రూ.11.95 కోట్లు – లగ్జరీ కార్లు, బర్త్‌డే పార్టీల ఖర్చులు..

దోచుకున్న సొమ్మును కారుమూరి కుటుంబం ఏ విధంగా వినియోగించిందో ఈడీ పూసగుచ్చినట్లు వివరించింది..
  • బంధువుల ఖాతాల్లోకి నిధులు: అక్రమ సొమ్ములో రూ.11.95 కోట్లను కారుమూరి కుమారుడు సునీల్, కోడలు కీర్తి, భార్య లక్ష్మీకిరణ్, కుమార్తె దీపిక, వియ్యంకుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించారు.
  • విలాసవంతమైన జీవితం: మరో రూ.3 కోట్లను వ్యక్తిగత అప్పులు తీర్చడానికి, స్థిరాస్తుల కొనుగోలుకు, మైనింగ్ లీజులకు వాడారు. లగ్జరీ కార్లు, అత్యంత ఖరీదైన చేతి గడియారాలు, విదేశీ/విమాన ప్రయాణాలు, గ్రాండ్ బర్త్‌డే పార్టీలతో పాటు పొలిటికల్ ఫండింగ్‌కు సైతం ఈ అక్రమ డబ్బే వినియోగించారని ఈడీ గుర్తించింది.

10 సార్లు నోటీసులిచ్చినా బేఖాతరు – తదుపరి చర్యలకు ఈడీ సిద్ధం:

జూన్ 24 నుంచి ఆగస్టు 17 వరకు ఏకంగా 10 సార్లు సమన్లు జారీ చేసినా కారుమూరి విచారణకు హాజరుకాకుండా కావాలనే తప్పించుకు తిరిగారని ఈడీ పేర్కొంది. ప్రస్తుతం ఆయనను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ కుంభకోణం వెనుక ఉన్న మరికొందరు కీలక రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *