Hyderabad:హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన హత్యాయత్నం, దౌర్జన్యం కేసులో దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (Officer on Special Duty) నార్ల సుమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో ముగ్గురు నిందితులను ఆంధ్రప్రదేశ్‌లోని మార్టూరులో అరెస్ట్ చేశారు. నిందితులను అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డిలుగా గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. గత నెల 30న జూబ్లీహిల్స్‌లోని సుమంత్ కార్యాలయానికి చెంగిచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను డబ్బుల లావాదేవీల పేరుతో రప్పించారు. అక్కడే ఉన్న సుమంత్, అతని అనుచరులు హరికృష్ణ నుంచి ఏకంగా రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు నిరాకరించడంతో ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం, బెదిరింపుల సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ప్రత్యేక బృందాలతో గాలింపు – ప్రధాన నిందితుడు సుమంత్ పరారీ..
కేసు నమోదు కావడంతో ప్రధాన నిందితుడు నార్ల సుమంత్ తన మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఉస్మాన్‌నగర్ ఓజోన్ హైట్స్‌లోని సుమంత్ నివాసంలో పోలీసులు నిఘా ఉంచినప్పటికీ అతను తప్పించుకున్నాడు. అయితే, ఇంటి వద్ద ఉన్న అతని కారు డ్రైవర్ నవీన్‌ను పోలీసులు మొదట అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సుమంత్‌తో పాటు మిగిలిన నిందితులను పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు 3 బృందాలుగా, సిటీ టాస్క్‌ఫోర్స్ ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నాయి. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడితే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెడతామని పోలీసులు స్పష్టం చేశారు.
