HYDRA Ranganath: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో కేవలం 50 గజాల స్థలంలో నాలాను ఆనుకుని నిర్మించిన 8 అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) తీవ్రంగా స్పందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిస్థితిని స్వయంగా సమీక్షించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణదారుల అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రెండు నెలల్లోనే 8 అంతస్తులు.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపిన ప్రధానాంశాలు..
-
నాలా ఆక్రమణ & అత్యంత వేగంగా నిర్మాణం: కేవలం 50 గజాల స్థలంలో ఏడు అంతస్తులతో పాటు ఒక పెంట్‌హౌస్ కలిపి మొత్తం 8 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించారు. అధికారులు ఎక్కడ అడ్డుకుంటారోననే భయంతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే పనులను గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసే ప్రయత్నం చేశారు.
-
బిల్డర్ సాజిద్ దందా: భవన నిర్మాణదారుడైన సాజిద్‌పై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉన్నాయని కమిషనర్ వెల్లడించారు. నాలాను ఆనుకుని ప్రమాదకరంగా చిన్న చిన్న స్థలాల్లో భవనాలు నిర్మించి హాస్టళ్లకు అద్దెకు ఇవ్వడం, విక్రయించడం అతనికి అలవాటుగా మారిందని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతనిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అంజయ్యనగర్‌లోని అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం..
ఈ ప్రాంతంలో పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రమాదకర కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపనుందని రంగనాథ్ హెచ్చరించారు..
-
సమగ్ర సర్వే & కూల్చివేతలు: ఘటన జరిగిన భవనం చుట్టుపక్కల మొత్తం హాస్టళ్లు, భారీ నివాసాలే ఉన్నాయి. నాలాలను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రతి అక్రమ భవనాన్ని పరిశీలించి త్వరలోనే పూర్తిగా కూల్చివేస్తామని తేల్చి చెప్పారు.
-
ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు: అక్రమ నిర్మాణాలు చేపట్టి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం అని ఆయన స్పష్టం చేశారు.
ఈ భవనంపై గతంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
