Nagababu

Nagababu: కోకాపేటలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఏపీ గ్రీన్ ఛైర్మన్ & ఎమ్మెల్సీ కొణిదల నాగేంద్రబాబు

Nagababu: మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు గారు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబవాసిని) మొక్కను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుండి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు.

ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ: అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గం.

ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుంది. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా! ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలి.

కుటుంబ సంప్రదాయంలో భాగంగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక తదితర కుటుంబ సభ్యుల పేర్లతో దాదాపు 120కి పైగా మొక్కలు నాటినట్లు నాగబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి, ప్రియమైన వారి ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *