Votes: తెలంగాణ ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ ఇటీవల ముగిసింది. అయితే, ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం విడుదలైన ముసాయిదా గణాంకాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 73.39 లక్షల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి పునఃపరిశీలన విభాగంలోకి చేర్చగా, ఇందులో అత్యధిక భాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం.
ఈ సవరణతో తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య గతంలో ఉన్న 3.38 కోట్ల నుంచి 2.64 కోట్లకు చేరినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.
రాజధాని పరిధిలోనే 43 లక్షల ఓట్లపై ప్రభావం..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో కలిపి సగటున 37.3 శాతం ఓట్లు ముసాయిదా జాబితాలో ప్రభావితమయ్యాయి..
-
హైదరాబాద్ జిల్లా: జిల్లాలో మొత్తం 47.36 లక్షల ఓటర్లకు గాను, క్షేత్రస్థాయి విచారణలో దాదాపు 19.41 లక్షల పేర్లు శాశ్వతంగా నివాసం మారడం, మరణించడం లేదా ఆచూకీ లభించకపోవడం వంటి కారణాల వల్ల జాబితాలోకి వెళ్లాయి.
-
రంగారెడ్డి & మేడ్చల్: రంగారెడ్డి జిల్లాలో 12.87 లక్షలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 10.71 లక్షల ఓట్లు డిజిటలైజేషన్ లేదా వెరిఫికేషన్ ప్రక్రియలో వివరాలు లభ్యం కాలేదు.
-
నోటీసుల జారీ: రాజధాని పరిధిలోని మూడు జిల్లాల్లో దాదాపు 38.93 లక్షల మందికి నోటీసులు అందనున్నాయని, వారు సరైన గుర్తింపు పత్రాలు సమర్పించి తమ ఓటును పునరుద్ధరించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఏయే నియోజకవర్గాల్లో ప్రభావం ఎక్కువ?
నగరంలో నివాసాలు మారే వారి సంఖ్య అధికంగా ఉండటం, ఉద్యోగాల రీత్యా ప్రాంతాలు మారడం వల్ల పలు నియోజకవర్గాల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి..
-
ఎక్కువ ప్రభావం: జూబ్లీహిల్స్ (1.80 లక్షలు), మలక్‌పేట (1.47 లక్షలు), ముషీరాబాద్ (1.40 లక్షలు), చంద్రాయణగుట్ట, కార్వాన్ మరియు సనత్ నగర్ నియోజకవర్గాల్లో చాలామంది ఓటర్ల వివరాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఆ జాబితాలోకి చేరాయి.
-
తక్కువ ప్రభావం: అంబర్ పేట్ నియోజకవర్గంలో 85 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ఫారాలు విజయవంతంగా నమోదు కావడంతో అక్కడ అతి తక్కువ మార్పులు నమోదయ్యాయి. అలాగే చార్మినార్, బహదూర్‌పురా ప్రాంతాల్లోనూ డిలీషన్ల శాతం తక్కువగా ఉంది.
“ఇది శాశ్వత తొలగింపు కాదు”: అధికారుల స్పష్టత
ప్రస్తుతం జాబితాలో వివరాలు లేని ఓటర్ల పేర్లు శాశ్వతంగా తొలగించబడవని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. పౌరులు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి తగినంత సమయం, అవకాశాలు కల్పించారు..
-
మున్సిపల్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాలు, ఎమ్మార్వో ఆఫీసుల్లో ముసాయిదా జాబితాలను అందుబాటులో ఉంచారు.
-
ఒకవేళ మీ పేరు ముసాయిదా జాబితాలో లేకపోయినా లేదా ఏవైనా పొరపాట్లు జరిగినా, వెంటనే ఫారమ్-6 (Form-6) నింపి ఆన్‌లైన్ ద్వారా లేదా మీ బూత్ స్థాయి అధికారి (BLO) ద్వారా ఉచితంగా తిరిగి నమోదు చేసుకోవచ్చు.
-
ఓటు వివరాలను పరిశీలించుకోవడానికి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ పోర్టల్ లేదా కేంద్ర ఎన్నికల సంఘం సేవల ద్వారా సరిచూసుకోవచ్చు.
