Job Offers: మీరు రోజూ వీడియో గేమ్స్ ఆడుతుంటారా? అయితే మీ గేమింగ్ స్కిల్స్ మీకు ఏకంగా రూ. 1.38 కోట్ల వార్షిక జీతంతో (దాదాపు $144,580) ఉండే ఒక హై-ప్రొఫైల్ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టగలవు!
నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికాలోని ‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ (FAA) విమానాల రాకపో0కలను నియంత్రించే ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు’ (Air Traffic Controllers) గా యువతను భర్తీ చేయడానికి వీడియో గేమర్లపై దృష్టి పెట్టింది. ఈ వినూత్న రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్ ద్వారా ఇప్పటికే 2,000 మందికి పైగా కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ (Sean Duffy) వెల్లడించారు.
సీన్ డఫీ ఏమన్నారంటే?
ఎఫ్‌ఏఏ అనుకున్న 100% నియామకాల లక్ష్యంలో ఇప్పటికే 94 శాతం భర్తీ పూర్తయిందని, మరో 2,000 మందికి పైగా అభ్యర్థులు విచారణ, ఎంపిక ప్రాసెస్ తర్వాతి దశల్లో ఉన్నారని సీన్ డఫీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు..
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి అత్యంత ప్రతిభావంతులను త్వరగా వ్యవస్థలోకి తెస్తున్నాం. ఇది ఏవియేషన్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మార్పు. అత్యంత పదునైన, సమర్థవంతమైన సిబ్బందిని తయారు చేస్తున్నాం.— సీన్ డఫీ, యుఎస్ రవాణా శాఖ కార్యదర్శి
అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత తీవ్రంగా ఉండటంతో నిరంతరం విమానాల రాకపోకల్లో జాప్యం, సర్వీసుల రద్దు జరుగుతుండేవి. ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగిపోవడంతో ఈ సమస్యకు చెక్ పెట్టడానికి యువతను ఆకట్టుకునేలా వీడియో గేమర్లను టార్గెట్ చేస్తూ ఏప్రిల్‌లో ఈ ప్రచారం ప్రారంభించారు.
గేమర్లనే ఎందుకు ఎంచుకుంటున్నారు?
రోజూ 80,000 కంటే ఎక్కువ విమానాల రాకపోకలను నియంత్రించే కంట్రోలర్ ఉద్యోగానికి అత్యంత చురుకైన మనస్సు, నిశిత పరిశీలన అవసరం.
-
నైపుణ్యాల అనుసంధానం: వీడియో గేమ్స్ ఆడటం వల్ల ఒకేసారి వేర్వేరు పనులు చేయడం (Multitasking), సమయానుకూలంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, క్లిష్టమైన సమస్యలను వెంటనే పరిష్కరించడం ఇంకా మైండ్ అప్రమత్తంగా ఉండే నైపుణ్యాలు పెరుగుతాయని ఎఫ్‌ఏఏ భావిస్తోంది.
-
పూర్వ అనుభవాలు: పాత కంట్రోలర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం.. గేమింగ్ అలవాటు ఉన్నవారు ఒత్తిడిలో కూడా ఏకాగ్రత కోల్పోకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోగలరని తెలిసింది.
అర్హతలు మరియు నిబంధనలు:
కేవలం వీడియో గేమ్స్ ఆడినంత మాత్రాన ఈ ఉద్యోగం వచ్చేస్తుందా అంటే లేదు! దీనికి మరికొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి:
-
పౌరసత్వం & వయస్సు: అభ్యర్థులు ఖచ్చితంగా అమెరికా పౌరులై ఉండాలి. దరఖాస్తు చేసే సమయానికి 31 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉండి, ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలగాలి.
-
పరీక్షలు: ఎఫ్‌ఏఏ నిర్వహించే ‘ఎయిర్ ట్రాఫిక్ స్కిల్స్ అసెస్‌మెంట్’ (ATSA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు మెడికల్, సెక్యూరిటీ క్లియరెన్స్ పొందాలి.
-
శిక్షణ: ఎంపికైన వారికి ఓక్లహామాలోని ఎఫ్‌ఏఏ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
-
డిగ్రీ అవసరం లేదు: ఈ ఉద్యోగానికి నాలుగేళ్ల కాలేజీ డిగ్రీ అవసరం లేదు. ఎలాంటి డిగ్రీ లేకపోయినా రూ. కోట్ల జీతం పొందే అరుదైన అవకాశం ఇందులో ఉంది.
సోషల్ మీడియాలో ఈ రిక్రూట్‌మెంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, ఐదు నెలల సమయాన్ని తగ్గించి అత్యంత వేగంగా నియామకాలు జరపడంలో ఈ విధానం ఎంతో విజయవంతమైందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
