Hydrogen Train: భారత రైల్వే చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. కాలుష్య రహిత, పర్యావరణహిత రవాణాయే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలు (Hydrogen-Powered Train) అందుబాటులోకి వచ్చింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వినూత్న రైలును జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, హర్యానా గవర్నర్ అశిమ్ కుమార్ ఘోష్, ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీలతో పాటు పలువురు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
1. జింద్ – సోనిపత్ మార్గంలో ప్రయాణం.. రైలు ప్రత్యేకతలు
ఈ ట్రైన్ కలర్ ని ఆకాశ నీలం (Sky-Blue) ఇంకా తెలుపు రంగుల కాంబినేషన్‌తో ఎంతో ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ఈ రైలులో మొత్తం 10 కోచ్‌లు (2 డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ట్రైలర్ కోచ్‌లు) ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఇందులో ఒకేసారి దాదాపు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
ఈ రైలు జింద్ నుండి సోనిపత్ మధ్య గల 89 కిలోమీటర్ల మార్గంలో నడుస్తుంది. గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, 12 స్టేషన్లలో ఆగుతూ రెండు గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. (ఈ రైలు డిజైన్ వేగం గంటకు 110 కిలోమీటర్లు).
2. ‘జీరో ఎమిషన్’ టెక్నాలజీ.. కాలుష్యానికి నో!
ఈ రైలుకు ‘నమో గ్రీన్‌రైల్’ (Namo Green Rail) అని పేరు పెట్టారు. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ టెక్నాలజీ (Hydrogren Fuel Cell Technology) సహాయంతో హైడ్రోజన్‌ను రైలులోనే విద్యుత్‌గా మారుస్తారు. దీనికి 3,200 HP సామర్థ్యం గల ప్రొపల్షన్ సిస్టమ్ ఉంది.
ఈ రసాయన ప్రక్రియ జరిగినప్పుడు ఎలాంటి కాలుష్య పొగ రాదు. కేవలం నీటి ఆవిరి (Water Vapour), వేడి మాత్రమే బై-ప్రొడక్ట్స్‌గా బయటకు వస్తాయి. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు (Zero Carbon Emissions).
సాధారణ ఎలక్ట్రిక్ రైళ్ల లాగా దీనికి పైన కరెంట్ వైర్లు (Overhead Electrification) అవసరం లేదు. ఎందుకంటే కరెంట్ అంతా రైలు లోపలే తయారవుతుంది. డీజిల్ వాడకం తగ్గడం వల్ల విదేశాల నుండి ఇంధన దిగుమతుల భారం కూడా తప్పుతుంది.
3. పూర్తి స్వదేశీ సాంకేతికత (Atmanirbhar Bharat)
‘ఆత్మనిర్భర్ భారత్’ చొరవ కింద ఈ రైలును పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి, తయారు చేశారు. ఈ రైలుకు సంబంధించిన పూర్తి మేధో సంపత్తి హక్కులు (IP Rights) భారతదేశానికే ఉంటాయని, భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఈ రైలు ప్రారంభంతో.. ఐరోపా (యూరప్), చైనా, అమెరికా వంటి కొన్ని ఎంపిక చేసిన దేశాల సరసన హైడ్రోజన్ టెక్నాలజీని వాడుతున్న దేశాల జాబితాలో భారత్ చేరింది.
4. హైడ్రోజన్ ప్లాంట్ మరియు భద్రతా ప్రమాణాలు
ఈ రైలు కోసం జింద్ స్టేషన్లోనే దేశంలోనే తొలి సమగ్ర హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నీటి ద్వారా హైడ్రోజన్‌ను తయారు చేయడం, నిల్వ చేయడం, రీఫ్యూయెలింగ్ చేయడం లాంటివి జరుగుతాయి. ఈ ప్లాంట్ దాదాపు 3,000 కేజీల హైడ్రోజన్‌ను స్టోర్ చేయగలదు. దీనికి ‘పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ (PESO) అనుమతి కూడా లభించింది.
హైడ్రోజన్ లీకేజీలను గుర్తించే సెన్సార్లు, పొగ ఇంకా మంటలను పసిగట్టే సిస్టమ్స్, అత్యవసర సమయాల్లో ఆటోమేటిక్‌గా హైడ్రోజన్ సప్లైని నిలిపివేసే వసతులను రైలులో ఏర్పాటు చేశారు. జర్మనీకి చెందిన ‘TUV SUD’ సంస్థ దీని భద్రతను పూర్తిగా పరీక్షించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భారత రైల్వేల ఆధ్వర్యంలో, ‘రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్’ (RDSO) సాంకేతిక పర్యవేక్షణలో రూపొందిన ఈ ప్రాజెక్ట్.. దేశం నిర్దేశించుకున్న జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (National Green Hydrogen Mission) లక్ష్యాలకు ఎంతో బలాన్ని చేకూర్చనుంది.
