IPL 2027-CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఒక ఊహించని షాక్ తగిలింది. సీఎస్‌కే జట్టుకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన లెజెండరీ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. జట్టుకు గుడ్‌బై చెప్పారు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘమైన, అద్భుతమైన బంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. గత మూడు సీజన్లుగా చెన్నై జట్టు వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరకపోవడంతో ఫ్లెమింగ్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలు చివరకు నిజమయ్యాయి.
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. ఐపీఎల్ ప్రారంభమైన 2008 మొదటి సీజన్లో సీఎస్‌కే తరఫున ప్లేయర్‌గా జట్టులోకి వచ్చారు. ఆ తర్వాత 2009లోనే ఆయనకు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించారు.
-
టైటిళ్ల వేట: ఆయన కోచింగ్‌లోనే చెన్నై ఏకంగా 5 ఐపీఎల్ టైటిళ్లను, 2 ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలను గెలుచుకుంది.
-
రికార్డులు: ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరడం, 10 సార్లు ఫైనల్స్ ఆడిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా సీఎస్‌కేను నిలబెట్టడంలో ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషించారు.
-
గ్లోబల్ లీగ్స్: సీఎస్‌కేతో పాటు దక్షిణాఫ్రికా (SA20) లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్, అమెరికా (MLC) లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లకు కూడా ఆయనే కోచ్‌గా వ్యవహరిస్తూ ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లారు.
యాజమాన్యం ఏమందంటే?
సీఎస్‌కే ఫ్రాంచైజీ యజమాని రూపా గురునాథ్, మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్.. ఫ్లెమింగ్ సేవలను కొనియాడారు.
గడిచిన రెండు దశాబ్దాలుగా మా టీమ్ కోచింగ్ విభాగానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. సీఎస్‌కేకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గెలిచే సంస్కృతిని నేర్పింది ఆయనే. మైదానంలో మా ప్రయాణం ముగిసినా.. చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది.అని రూపా గురునాథ్ భావోద్వేగంగా చెప్పారు.
భావోద్వేగానికి గురైన ఫ్లెమింగ్
జట్టు నుంచి తప్పుకోవడంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ.. “క్రీడల్లో 18 ఏళ్లు అంటే ఒక జీవితకాలం లాంటిది. చెన్నై సూపర్ కింగ్స్‌తో గడిపిన కాలం నా కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఎన్నో మరుపురాని విజయాలు, కఠినమైన పరిస్థితులను మేమంతా కలిసి ఎదుర్కొన్నాం. ఈ జ్ఞాపకాలు నా జీవితాంతం గుర్తిండిపోతాయి. ఇకపై కూడా సీఎస్‌కేకు ఒక పెద్ద అభిమానిగా సపోర్ట్ చేస్తూనే ఉంటాను” అని తన మనసులోని మాటను పంచుకున్నారు.
