GMC: పల్నాడు జిల్లా ప్రజలకు ఒక సూపర్ న్యూస్ అందింది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీకి (Government Medical College) గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కాలేజీలో 100 ఎంబీబీఎస్ (MBBS) సీట్ల భర్తీకి జాతీయ మెడికల్ కౌన్సిల్ (NMC) అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అధికారికంగా వెల్లడించారు. వచ్చే 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ సీట్ల భర్తీ ఇంకా క్లాసులు ప్రారంభం కానున్నాయి.
ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ పనులన్నీ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. కాలేజీలో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కూడా వేగంగా జరుగుతోంది. అలాగే, కాలేజీకి అనుబంధంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి కోసం డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర ల్యాబ్ టెక్నీషియన్ల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. సొంత జిల్లాలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానుండటంతో పల్నాడు ప్రాంత ప్రజలు, విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
