Revanth Reddy

Revanth Reddy: భద్రాచలం రాముడిపై ఆన.. 2029లో 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్సే పీఠం.. కేసీఆర్ ఫ్యామిలీపై ఫైర్!

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వేదికగా రాజకీయంగా మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. చింతకాని మండలం జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన భారీ ‘రైతు ఆశీర్వాద సభ’కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా వానాకాలం పంట పెట్టుబడి కోసం చివరి విడతగా రూ.1,009 కోట్ల రైతు భరోసా పైసలను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. దీనితో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం రూ.8,759 కోట్లను అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసినట్లయింది. రాష్ట్రవ్యాప్తంగా 74 lakhs మంది రైతులకు చెందిన 1.45 కోట్ల ఎకరాల భూములకు ఈ సాయం అందిందని సీఎం చెప్పారు.

ఖమ్మం జిల్లా నా రాజకీయ గుండెకాయ!

సభకు చీమల దండలా ఉప్పెనలా వచ్చిన జనాలను చూసి తన గుండె పులకించిపోయిందని రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లానే గుండెకాయ అని కొనియాడారు. 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ రాక్షస పాలనను కాదని కాంగ్రెస్‌లో చేరినప్పుడు జనం ఉప్పెనలా వచ్చారని, సరిగ్గా 36 నెలల తర్వాత మళ్లీ ఇదే జూలైలో ప్రజాపాలనను ఆశీర్వదించడానికి రైతులు అదే స్థాయిలో తరలివచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను మళ్లీ మొలకెత్తనివ్వబోమని ఇక్కడి ప్రజలు ఒట్టు పెట్టుకున్నారని, అందుకే ఆ ‘పాపాల భైరవుడిని’ ఫామ్‌హౌస్‌లో బంధించారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ డబ్బు మూటలను తట్టుకుని కాంగ్రెస్‌ను గెలిపించారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండుసున్నా వస్తుందని తాను చెప్పిందే జరిగిందని అన్నారు.

భద్రాచలం రాముడిపై ఆన.. 2029లో 117 సీట్లు పక్కా!

రాబోయే ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం రాముడి సాక్షిగా కీలక ప్రతిన పూనారు. “రాసి పెట్టుకోండి.. జూలై 10, 2026న చెప్తున్నా, నేను చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది” అన్నారు. చాలామంది అనుకుంటున్నట్లు 2028 డిసెంబర్‌లో ఎన్నికలు జరగవని, 2029 జూన్‌లోనే ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు 26కు, అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయన్నారు. ఆ 182 సీట్లలో కాంగ్రెస్ ఒంటరిగానే 117 స్థానాలు గెలిచి మళ్లీ రెండోసారి అధికారంలోకి వస్తుందని భద్రాచలం రాముడి మీద ఆన వేసి చెప్పారు. రాబోయే కురుక్షేత్రంలో గెలిచేది కాంగ్రెస్సేనని, కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతామని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఓడించేందుకు తాము రోజుకు 18 గంటలు పనిచేస్తామని సవాల్ విసిరారు.

వరి వేస్తే ఉరి అన్నవాళ్లు.. ఈరోజు కరెంట్ తీగలు పట్టుకోండి!

గతంలో కేసీఆర్ ‘వరి వేస్తే ఉరి’ అన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ చేసి చూపిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తూ, వడ్లకు బోనస్ ఇస్తున్నామని చెప్పారు. అలాగే, కన్నెపల్లి పంప్‌హౌస్‌లు ఆన్ చేయాలని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని, ఒకవేళ వాటిని ఆన్ చేస్తే భద్రాచలం రాముడి గుడితో పాటు 44 గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీ స్వార్థ రాజకీయాల కోసం రాముడి గుడి మునగాలా? అని ప్రశ్నించారు. “కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని విషప్రచారం చేశారు, ఇప్పుడు కావాలంటే కరెంట్ తీగలు పట్టుకోండి.. సలసల మాడిపోకపోతే చూడండి” అంటూ ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *