Tirupati

TTD Job Fraud: అన్యమత కోటా పేరుతో రూ.3 కోట్ల మోసం.. నకిలీ ఆర్డర్లతో లాయర్ వేషంలో దగా!

TTD Job Fraud: తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయిపోతుందని, సమాజంలో మంచి గౌరవం ఉంటుందని నిరుద్యోగులు భావిస్తుంటారు. సరిగ్గా వారికున్న ఈ ఆశనే పెట్టుబడిగా మార్చుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అనే కేటుగాడు. తాను ఒక లాయర్ (అడ్వకేట్) అని పరిచయం చేసుకుంటూ.. టీటీడీలోని పెద్ద పెద్ద అధికారులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని నమ్మించాడు. ముఖ్యంగా టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం తనకు బాగా తెలుసని, ఆయన ద్వారా ఈజీగా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక ఫేక్ నెట్‌వర్క్ క్రియేట్ చేసి నిరుద్యోగులకు వల వేశాడు.

ఇటీవల టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్నే తన మోసానికి మెయిన్ ప్లాన్‌గా వాడుకున్నాడు. అన్యమతస్థులను తీసేసిన చోట కొత్తగా హిందువులను తీసుకుంటున్నారని, ఆ ఖాళీల్లోనే మీకు జాబ్స్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అంతేకాదు, నమ్మకం కుదర్చడం కోసం టీటీడీ అధికారిక లోగోను దొంగతనంగా ఉపయోగించి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను (ఉద్యోగ నియామక పత్రాలు) కూడా తయారు చేసి బాధితుల చేతిలో పెట్టాడు.

ఆ నకిలీ లెటర్లను చూసి నిజమైన ఉద్యోగాలే అనుకుని నిరుద్యోగులు నమ్మే శారు. ఒక్కో పోస్టును బట్టి రూ.15 లక్షల నుండి ఏకంగా రూ.50 లక్షల వరకు నిందితుడికి ఇచ్చుకున్నారు. ఇలా దాదాపు 10 నుండి 25 మందికి పైగా నిరుద్యోగుల దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఈ పెద్ద స్కామ్ విలువ ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

డబ్బులు తీసుకుని ఫేక్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత.. డ్యూటీలో చేరే (జాయినింగ్) తేదీల విషయంలో నిందితుడు నెలల తరబడి సాగదీస్తూ వచ్చాడు. బాధితులు గట్టిగా నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో డౌట్ వచ్చిన బాధితులు నేరుగా టీటీడీ ఆఫీస్‌కు వెళ్లి విచారించగా, తమకు ఇచ్చినవన్నీ దొంగ సర్టిఫికేట్లని తెలిసి షాకయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులంతా కలిసి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మోసం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *