Modi

Modi: ‘మినీ ఇండియా’గా మెల్‌బోర్న్.. మార్వెల్ స్టేడియంలో భారత్ ప్రగతిపై కీలక వ్యాఖ్యలు!

Modi: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి మెల్‌బోర్న్ నగరం అపూర్వ స్వాగతం పలికింది. మెల్‌బోర్న్‌లోని ప్రసిద్ధ ‘మార్వెల్ స్టేడియం’ (Marvel Stadium) లో ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి భారతదేశానికి ఎంతో మంచి మిత్రుడని కొనియాడారు. తాను గతంలో రెండుసార్లు సిడ్నీ నగరంలో ప్రవాస భారతీయులను కలిశానని, కానీ ఈసారి ప్రత్యేకంగా మెల్‌బోర్న్ వాసులతో సమయం గడపడానికే ఇక్కడికి వచ్చానని చెప్పారు. “నేను 2014లో ఇక్కడికి వచ్చాను, మళ్లీ 2023లో వచ్చాను.. ఇప్పుడు మరోసారి మీ ముందుకు వచ్చాను. ఇలా గత 12 ఏళ్లలో మూడుసార్లు ఆస్ట్రేలియాకు వచ్చి నా పర్యటనల్లో హ్యాట్రిక్‌ కొట్టాను” అని మోడీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రెండు దేశాల ప్రత్యేకతలను వివరిస్తూ ప్రధాని మోడీ క్రికెట్ ప్రస్తావన తెచ్చారు. భారతదేశంలోని అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం (నరేంద్ర మోడీ స్టేడియం) ఉండగా, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకానిక్ స్టేడియంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. ప్రవాస భారతీయులతో కిక్కిరిసిపోయిన మార్వెల్ స్టేడియం సభను చూసి ఆనందం వ్యక్తం చేస్తూ.. “ఆస్ట్రేలియాలో ఈ షో హౌస్‌ఫుల్‌, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది” అని మోడీ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తుచేస్తూ.. తాను 2014లో ఇక్కడికి రాకముందు వరకు, గత 18 ఏళ్ల కాలంలో ఏ భారత ప్రధానమంత్రి కూడా ఆస్ట్రేలియాలో పర్యటించలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆస్ట్రేలియా అభివృద్ధిలో ఇండియన్‌ డయాస్పోరా (భారతీయుల) పాత్ర చాలా గొప్పదని, ఇక్కడి పప్పు, కూరగాయలు, పాలు వాడినా.. వంటల్లో భారతీయ మసాలాలు, చాయ్‌లోనే మనదైన ముద్ర కనిపిస్తోందని చమత్కరించారు. మెల్‌బోర్న్‌ను ఒక ‘మినీ ఇండియా’గా అభివర్ణించిన ఆయన, ఒక కల పూర్తవగానే మరో కొత్త కల కనాలని, ఒక పెద్ద లక్ష్యం తర్వాత మరో పెద్ద సంకల్పాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

భారతదేశం వివిధ రంగాలలో సాధిస్తున్న సరికొత్త విజయాలను కూడా ప్రధాని మోడీ ప్రవాస భారతీయుల ముందు ఉంచారు. సాంకేతిక రంగంలో భారత్ వేగంగా దూసుకెళ్తోందని, దేశంలోని 99 శాతం జిల్లాల్లో ఇప్పటికే 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిందని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా భారత్ అవతరించిందని చెప్పారు. మేడిన్ ఇండియా (Made in India) ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్‌గా మారిందని.. చిన్న చిప్స్ తయారీ నుండి పెద్ద పెద్ద యుద్ధ నౌకల (షిప్స్) నిర్మాణం వరకు ప్రతి రంగంలో భారత్ సత్తా చాటుతోందని గర్వంగా ప్రకటించారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని స్పష్టం చేశారు.

అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన రికార్డులను ప్రధాని గుర్తుచేశారు. చంద్రయాన్ మిషన్ ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole) పై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఏకైక దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. ఇప్పుడు అంతరిక్షంలోకి మనుషులను పంపే ‘గగన్‌యాన్’ ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోందని, భవిష్యత్తులో మన దేశం సొంతంగా ‘స్పేస్ స్టేషన్’ను కూడా నిర్మించబోతోందని వెల్లడించారు. రక్షణ రంగంలో ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ఉగ్రవాదుల శిబిరాలను నామరూపాలు లేకుండా చేసి భారత్ తన బలమేంటో ప్రపంచానికి చూపిందని గుర్తుచేశారు. ప్రవాస భారతీయులే ఇరుదేశాల బంధానికి నిజమైన వారధులని, భవిష్యత్ అంతా యువతదేనని చెబుతూ వికసిత్ భారత్ నిర్మాణం కోసం తాను నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *