Donald Trump

Donald Trump: మళ్లీ మొదలైన అమెరికా-ఇరాన్ యుద్ధం!.. ఒప్పందం రద్దు చేసిన ట్రంప్.. బాంబుల వర్షం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇరాన్‌తో గతంలో కుదిరిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్), అవగాహన ఒప్పందాలు ఇక ముగిసిపోయాయని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో (NATO) సదస్సులో మాట్లాడిన ఆయన.. ఇరాన్ నేతలను మోసగాళ్లు, అబద్ధాలకోరులుగా అభివర్ణించారు. ఇరాన్‌ను ఎలాగైనా అణ్వాయుధాలకు దూరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ దేశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు.

హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు వాణిజ్య చమురు నౌకలపై ఇరాన్ సైన్యం దాడి చేసిందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతికారంగానే బుధవారం తెల్లవారుజామున అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లోని ఖార్గ్ దీవి, బందర్ అబ్బాస్ వంటి కీలక ప్రాంతాల్లోని దాదాపు 80 సైనిక లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు, డ్రోన్ లాంచ్ ప్యాడ్లను అమెరికా ధ్వంసం చేసింది. దీనికి తగ్గట్లే ఇరాన్ కూడా ఒమాన్ సముద్రంలోని అమెరికా యుద్ధ నౌకలతో పాటు బహ్రెయిన్, కువైట్‌లోని యూఎస్ సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో ఎదురుదాడులు ప్రారంభించింది.

మరోవైపు ఇరాన్ ఆయిల్ అమ్ముకోకుండా ట్రంప్ సర్కార్ ఆంక్షల ఉక్కుపాదం మోపడంతో, ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా పడింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు పెరగడంతో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా 5 శాతం పైగా పెరిగి, బ్యారెల్‌కు 78 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ప్రపంచ దేశాలతో పాటు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ ఉద్రిక్తతలు రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితిని ఎంతటి ప్రమాదంలోకి నెట్టేస్తాయోనని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *