Pattiseema: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏలూరు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం మండలంలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. మొత్తం 12 పంపుల ద్వారా ఈ ప్రాజెక్టు కుడి కాల్వలోకి 4,248 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. అంతకుముందు పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల వద్ద మంత్రి రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో కలిసి గోదావరి మాతకు భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని కొనియాడారు. గతంలో ఇదే ప్రాజెక్టును ‘ఒట్టిసీమ’ అంటూ అవహేళన చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. 2014-19 మధ్య కాలంలో రూ.1,300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ.. నేడు రైతులకు సాగునీరు అందిస్తూ దాదాపు రూ.50 వేల కోట్ల ఆదాయాన్ని సృష్టించిందని మంత్రి వెల్లడించారు.
ముందుచూపు, పాలనా అనుభవం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో చెప్పడానికి పట్టిసీమ పథకమే ఒక గొప్ప ఉదాహరణ అని మంత్రి అన్నారు. జగన్‌కు అలాంటి ఆలోచన లేకపోవడం వల్లే గత ఐదేళ్లు పట్టిసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు ఈ పట్టిసీమ పథకం ద్వారా 450 టీఎంసీలకు పైగా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించి రైతాంగాన్ని ఆదుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలోని ఆలమట్టి నుంచి నాగార్జునసాగర్ వరకు ఉన్న ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీలో ఉన్నాయని, అందుకే గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు వృథాగా సముద్రంలో కలవకుండా ఒడిసిపట్టుకుని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
