Love Marriage: తమిళనాడులోని తిరుపత్తూరులో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నవారి ప్రేమ కంటే, ఒక యువతికి తను ప్రేమించిన ప్రియుడి ప్రేమే ఎక్కువైంది. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లోనే కూతురి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకుంటూ తమతో వచ్చేయమని బతిమిలాడినా.. ఆ కూతురు మనసు కరగలేదు. వారిని వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.
ఇటీవల కాలంలో చాలా మంది యువతీ యువకులు కన్నవారిని ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తిరుపత్తూరుకు చెందిన ఒక ప్రేమ జంట.. పెద్దల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆ యువతి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. కూతురు పెళ్లి చేసుకుని భర్తతో కలిసి రావడం చూసిన ఆ తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
స్టేషన్ లోనే అందరి ముందూ కూతురి కాళ్లపై పడి, తమతో ఇంటికి వచ్చేయమని ఏడ్చారు. అయినా ఆ కూతురిలో ఎలాంటి చలనం లేదు. కనీసం తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా ఆమె చేయలేదు. యువతి మేజర్ (వయసు నిండిన పిల్లే) కాబట్టి చట్టప్రకారం ఆమెకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని చెప్తూ పోలీసులు వారిని పంపించి వేశారు. కళ్లముందే కూతురు వెళ్లిపోతుంటే ఆ కన్నవారు రోడ్డుపై పడి గుండెలవిసేలా రోదించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కన్నవారిని అలా రోడ్డున పడేయడం తప్పు అంటూ కొందరు తల్లిదండ్రులకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు మాత్రం చట్టప్రకారం ఆమెకు నచ్చిన జీవితాన్ని ఎంచుకునే హక్కు ఉందని కామెంట్లు పెడుతున్నారు.
