RGV: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశంగా మారిన సినిమా ‘సత్లుజ్’ సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసినప్పటికీ, ఆ తర్వాత అక్కడి నుండి కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ (RGV) ఈ సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కేవలం ఒక కథ మాత్రమే కాదని, మన చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసే ఎప్పటికీ మానని ఒక బలమైన గాయం అని ఆయన అభివర్ణించారు.
ఈ సినిమాలో కథానాయకుడు దిల్జిత్ దొసాంజే ఎక్కడా అనవసరమైన హడావుడి చేయకుండా, తన మనఃసాక్షికి అనుగుణంగా ఎంతో నిశ్శబ్దంగా, గంభీరంగా నటించాడని వర్మ ప్రశంసించారు. మరో నటుడు అర్జున్ రాంపాల్ నటన కూడా ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చిందన్నారు. నేరాల్లో ప్రభుత్వ వ్యవస్థలు ఎలా భాగమయ్యాయనే విషయాన్ని దర్శకుడు హనీ ట్రెహన్ ఎంతో వాస్తవికతతో చూపించారని, ఈ కథను సంచలనం చేయడం కంటే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా అద్భుతంగా తీర్చిదిద్దారని వర్మ కొనియాడారు.
ఒక ప్రజాస్వామ్య దేశంలో సొంత పౌరులనే ఎలా కబళించి, అందుకు సంబంధించిన సాక్ష్యాలు లేకుండా ఎలా తుడిచేస్తారో సినిమాలో చూపించడం సామాన్యమైన విషయం కాదని ఆర్జీవీ అన్నారు. అధికారంలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టేలా నిజాయతీగా నిజాలను వెల్లడించడమే నిజమైన కళ అని, ఆ బాధ్యతను మూవీ టీమ్ ధైర్యంగా పూర్తి చేసిందని మెచ్చుకున్నారు. ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని, సమాజంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఇలాంటి గొప్ప సినిమాలను అందరూ చూడాలని, దీనిపై సమాజంలో చర్చ జరగాలని వర్మ కోరారు. సినిమాలో బాధితులను ఎన్కౌంటర్ చేసినట్లుగా, ఈ సినిమాను కూడా అధికారంలో ఉన్నవారు తొక్కేయడానికి ప్రయత్నించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కథకు మూలమైన జస్వంత్ సింగ్ ఖల్రాకు ఏం జరిగిందో, ఈ సినిమాకు కూడా అలా చేయవద్దని కోరారు. నిజాన్ని ఎంత దాచాలని చూస్తే, అది అంతకంటే బలంగా బయటకు వస్తుందని అయాన్ రాండ్ చెప్పిన మాటని వర్మ గుర్తు చేశారు.
