Ramayana: భారతీయ పౌరాణిక కథలను ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చూపించేందుకు ‘రామాయణం’ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం హాలీవుడ్ సంస్థల దృష్టిని కూడా ఆకర్షిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా నిజంగానే హాలీవుడ్ స్టూడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందా అనేదానిపై అమెరికాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక భారతీయ చలనచిత్ర వేడుకలో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాస మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. డిజిటల్ క్రియేటర్ సబీన్ ఫహీమ్ ఆయనతో మాట్లాడిన వీడియోను నెట్లో పంచుకున్నారు. భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని ఆమె అనగా, డాక్టర్ శ్రీనివాస కూడా దాన్ని సమర్థించారు. భారతీయ కథలు ఎంత గొప్పవో ప్రపంచానికి తెలియజేయడంలో మీడియా పాత్ర కీలకమని ఆయన అన్నారు.
ఈ ఏడాది మొదట్లో జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో ‘రామాయణం’కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్ వంటి వారు కూడా ఈ కథపై ఆసక్తి చూపించారని చెప్పారు. దీనివల్ల ఈ సినిమా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విడుదలయ్యే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు.
ఇదే సమయంలో, హాలీవుడ్ ప్రముఖ సంస్థ ‘వార్నర్ బ్రదర్స్’ ఈ సినిమా పంపిణీ బాధ్యతలు తీసుకోబోతోందా అని అడగగా.. డాక్టర్ శ్రీనివాస స్పందిస్తూ, తన వద్ద అలాంటి అధికారిక సమాచారం ఏదీ లేదని చెప్పారు. వార్నర్ బ్రదర్స్‌తో ఒప్పందం కుదిరినట్లు వస్తున్న వార్తలను ఆయన ధృవీకరించలేదు. చిత్రబృందం లేదా వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ఈ వార్తలు కేవలం పుకార్లనే చెప్పాలి.
దర్శకుడు నితేష్ తివారీ తీస్తున్న ఈ భారీ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ మరియు మన ఏఆర్ రెహమాన్ కలిసి సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు, జూలై 23 నుంచి 26 వరకు జరిగే కామిక్‌కాన్ వేడుకల్లో ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన కొత్త వీడియోలు లేదా పోస్టర్లు విడుదల చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అంతర్జాతీయ సాంకేతికతతో వస్తున్న ఈ సినిమా మన కథను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని సినీ వర్గాలు నమ్ముతున్నాయి.
