Chandrababu

Chandrababu: రూ. 36,700 కోట్లతో JSW గ్రీన్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం.. 24 నెలల్లో పూర్తి చేస్తామని హామీ!

Chandrababu: రాయలసీమ అంటే ఒకప్పుడు కరువు నేల, ఫ్యాక్షన్ రక్తం పారిన ప్రాంతం. కానీ, ఇకపై రాయలసీమ అంటే స్పేస్ టెక్నాలజీ, ఏరోస్పేస్, కియా కార్లు, హీరో బైకులు, డ్రోన్లు, గ్రీన్ ఎనర్జీ.. అన్నింటికీ మించి పచ్చదనం ఇంకా పరిశ్రమల జలకళ. ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ అని చేసి చూపిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  చెప్పారు.

కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ. 16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక ‘జేఎస్‌డబ్ల్యూ (JSW) రాయలసీమ స్టీల్‌ప్లాంట్‌ ’ పనులకు సీఎం చంద్రబాబు, జేఎస్‌డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలతో కలిసి భూమిపూజ చేసి, పనులను అధికారికంగా ప్రారంభించారు. ఇదే వేదికపై నుండి విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును కూడా సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు.

1. గతంలో మోసపూరిత శంకుస్థాపనలు.. నేడు నిజమైన ఉక్కు సంకల్పం!

ఇదే ప్రాజెక్టుకు గత పాలకులు 2019 డిసెంబరులో ఒకసారి, 2023లో రెండోసారి.. ఇలా రెండుసార్లు మోసపూరిత భూమిపూజలు చేశారు. కనీసం ఒక తట్ట మట్టి తీశారా? ఒక చిన్న భవనమైనా కట్టారా? ఓబులాపురం గనుల పేరుతో ఖనిజ సంపదను విదేశాలకు స్మగ్లింగ్ చేసి సొంత ఖజానాలు నింపుకుని జైళ్లకు పోయారు తప్ప కడప జిల్లాకు ఏం చేయలేదు.

తాము అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అన్ని అడ్డంకులు, క్లియరెన్సులు తొలగించి, ప్లాంట్ కోసం 1100 ఎకరాల భూమిని కేటాయించి, ఇవాళ పనులు ప్రారంభించామని తెలిపారు.

ఈరోజు తేదీ జూలై 3, 2026. సరిగ్గా రాబోయే 24 నెలల్లో ఈ ప్లాంట్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. మళ్లీ నేనే వచ్చి ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తా అని సీఎం డేట్ రాసి పెట్టుకోమంటూ సవాల్ విసిరారు.

2. రూ. 36,700 కోట్ల మెగా ఇన్వెస్ట్‌మెంట్ & ‘గ్రీన్ స్టీల్’ రికార్డు!

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఈ ప్రాంతంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతోందని సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు:

  • ఉక్కు కర్మాగారం (ఫేజ్ 1 & 2): రూ. 16,350 కోట్ల వ్యయం. (మొదటి దశకు రూ. 4,500 కోట్లు, రెండో దశకు రూ. 11,850 కోట్లు). దీని ద్వారా 2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరగనుంది.

  • గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్లాంట్: ఈ ఉక్కు కర్మాగారానికి అవసరమైన పర్యావరణ అనుకూల విద్యుత్ కోసం అదనంగా రూ. 20,350 కోట్లతో సోలార్ ప్లాంట్ నిర్మించబోతున్నారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 36,700 కోట్లు.

  • దేశంలోనే తొలి రికార్డు: భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 100% గ్రీన్ ఎనర్జీ (సౌర విద్యుత్)తో పర్యావరణానికి హాని లేని ‘గ్రీన్ స్టీల్’ ఉత్పత్తి చేసే తొలి ప్రాజెక్టుగా రాయలసీమ జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్ చరిత్ర సృష్టించబోతోంది.

  • మౌలిక వసతుల కనెక్టివిటీ: ప్లాంట్ అవసరాల కోసం గండికోట జలాశయం నుండి 15 కి.మీ. పైప్‌లైన్ ద్వారా 2 టీఎంసీల నీటిని ఇస్తున్నామని, అలాగే 12 కి.మీ. నేషనల్ హైవే కనెక్టివిటీ, ముద్దనూర్ రైల్వే స్టేషన్ నుండి 12 కి.మీ. ప్రత్యేక రైల్వే లైన్ నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు.

3. ఆంధ్రప్రదేశ్ – రాబోయే రోజుల్లో ‘ఉక్కు రాష్ట్రం’

రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమల విప్లవం రాబోతోందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు..

  1. విశాఖ ఉక్కు సంరక్షణ: తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కును కాపాడటానికి ప్రధాని మోదీతో మాట్లాడి రూ. 1,140 కోట్ల ఆర్థిక ప్యాకేజీని తెచ్చి మళ్లీ లాభాల బాట పట్టించామని చెప్పారు.

  2. నక్కపల్లి ఆర్సెలార్ మిత్తల్: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ. 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో, 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ రాబోతోందని గుర్తుచేశారు.

  3. ఉక్కు సీమ: విశాఖతో పాటు ఇప్పుడు నా రాయలసీమ కూడా జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్ ద్వారా దేశంలోనే బిగ్గెస్ట్ ఉక్కు కేంద్రంగా అవతరించబోతోందన్నారు.

 4. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు.. గంజాయి, రౌడీయిజంపై ఉక్కుపాదం!

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. “నాపై గతంలో 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినా భయపడలేదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. సమాజం కోసమే నా పోరాటం. ఇటీవల విజయవాడలో పోలీసులపై దాడి చేయడం, గంజాయి బ్యాచ్‌లు రోడ్లపైకి రావడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షన్ ముఠాలు సాగవు. ‘ఈగల్ బ్రాండ్’తో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేశాం. ఏ ఆడబిడ్డ జోలికి వచ్చినా అదే వాడికి చివరి రోజు అవుతుంది. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటేనే జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారు” అని స్పష్టం చేశారు.

అలాగే స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు గండికోట ఆర్ అండ్ ఆర్ సమస్యను తానే స్వయంగా పరిష్కరిస్తానని, రాజోలి 3 టీఎంసీల ప్రాజెక్ట్, ఎస్ఆర్బీసీ పనులు పూర్తి చేస్తానని, జమ్మలమడుగులోని కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని జిందాల్ సంస్థ సొంత నిధులతో అద్భుతంగా డెవలప్ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. అమెరికాలో గ్రాండ్ కాన్యన్ ఉంటే.. దాన్ని మరిపించే సుందర దృశ్యం మన గండికోట. రాయలసీమ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇక అన్‌స్టాపబుల్ అని నినదిస్తూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *