Harish Rao: 

Harish Rao: గోల్ కొడదామని వచ్చి.. సెల్ఫ్ గోల్ వేసుకున్నారు!

Harish Rao: తెలంగాణ రాష్ట్ర అప్పుల వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం క్లైమాక్స్‌కు చేరింది. మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌కు, పంపిన వాట్సాప్ లేఖకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జూపల్లి తీరు పూటకో సవాల్, రోజుకో అడ్రస్‌లా మారిందని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్‌పై గోల్ కొడదామని వచ్చి, చివరకు తమకు తామే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

చర్చా వేదికల విషయంలో జూపల్లి కృష్ణారావు పదే పదే మాట మారుస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మొదట తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పి జూపల్లే తోక ముడిచారని, ఆ తర్వాత గన్‌పార్క్‌కు రమ్మన్నారని గుర్తుచేశారు. తాము గన్‌పార్క్‌కు వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి తమను అక్రమంగా అడ్డుకుందని మండిపడ్డారు. మొదట నన్ను, కేటీఆర్‌ను చర్చకు రమ్మని సవాల్ విసిరిన జూపల్లి.. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఏకంగా కేసీఆర్‌ను రావాలంటూ కొత్త పల్లవి అందుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

జూపల్లి కృష్ణారావు తనకు వాట్సాప్‌లో పంపిన లేఖ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ అజ్ఞానమేంటో బయటపడిందని హరీష్ రావు విమర్శించారు. జూపల్లి పంపిన లేఖలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఏకంగా రూ. 1.77 లక్షల కోట్ల అప్పు చేసినట్లు ఆయనే ఒప్పుకున్నారని తెలిపారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక లెక్కల ప్రకారం కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1.86 లక్షల కోట్లుగా ఉందని, ఆర్బీఐ ఇచ్చిన వాస్తవ లెక్కలను కూడా ఈ ప్రభుత్వం తప్పుగా చూపిస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు.

రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి జూపల్లికి అస్సలు పొంతన లేదని హరీష్ రావు ఎండగట్టారు. కేవలం ఐదు నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము రూ. 3.47 లక్షల కోట్ల అప్పు చేసినట్లు స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఒకరేమో రూ. 3.47 లక్షల కోట్లు అంటారు, మరొకరేమో లేఖలో రూ. 1.77 లక్షల కోట్లు అంటారు.. అసలు మీ ప్రభుత్వంలో ఎవరి మాట నిజమో తేల్చుకోవాలని నిలదీశారు. జూపల్లి కృష్ణారావుకు నిజంగానే పాలమూరు పౌరుషం, చీము, నెత్తురు ఉంటే.. తన అబద్ధాల లేఖకు బాధ్యత వహిస్తూ తక్షణమే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *