Gold Man Arrest: హైదరాబాద్ నగరంలో తక్కువ ధరకే నకిలీ బంగారం ఆశ చూపి లక్షల రూపాయలు వసూలు చేసిన ఒక కిలాడీ ‘గోల్డ్‌మ్యాన్’ ఉదంతం వెలుగుచూసింది. మార్కెట్ ధర కంటే భారీ డిస్కౌంట్‌కు బంగారం ఇస్తానంటూ నమ్మించి రూ.30 లక్షల మేర మోసానికి పాల్పడిన నిందితుడిని నారాయణగూడ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీస్ ఇన్స్పెక్టర్ సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ పరిధిలో నివసించే వేగ్రోజ్ కృష్ణాచారి సాంప్రదాయ స్వర్ణకార వృత్తిని కొనసాగిస్తూనే, ఎన్ఎస్ జువెల్లరీ యజమాని నవీన్‌సింగ్‌తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్లను బట్టి హయత్‌నగర్‌లోని ఎన్ఎస్ జ్యువెలరీ ద్వారా ఆభరణాలు తయారు చేయించి ఇచ్చేవాడు. ఈ క్రమంలో కృష్ణాచారికి భీమేశ్వరచారి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మార్కెట్ ధర కంటే ఏకంగా 20 శాతం తక్కువకే స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ఇప్పించే ఒక వ్యక్తి తనకు తెలుసంటూ.. అత్తాపూర్‌కు చెందిన గోల్డ్‌మ్యాన్ అలియాస్ సూర్యాభాయ్ (అసలు పేరు పొట్లపు సురేశ్‌కుమార్) ను భీమేశ్వరచారి వీరికి పరిచయం చేశాడు.
ఆ సమయంలో మార్కెట్లో కిలో బంగారం ధర రూ.1.56 కోట్లు ఉండగా.. తాను కేవలం రూ.1 కోటికే ఇస్తానని సూర్యాభాయ్ నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మిన కృష్ణాచారి, నవీన్ సింగ్ మరికొందరితో కలిసి ఈ ఏడాది జనవరి 26న హిమాయత్‌నగర్‌లో సూర్యాభాయ్‌ను కలిసి అడ్వాన్స్‌గా రూ.11 లక్షల నగదు ఇచ్చారు. ఆ తర్వాత నిందితుడు మరికొంత డబ్బు డిమాండ్ చేయడంతో ఫిబ్రవరి 10న మరో రూ.10 లక్షలు ముట్టజెప్పారు. ఇలా విడతల వారీగా మొత్తం రూ.30 లక్షలు వసూలు చేసిన సూర్యాభాయ్.. ఆ తర్వాత బంగారం ఇవ్వకుండా, ఫోన్ ఎత్తకుండా బాధితులను తిప్పించుకోవడం మొదలుపెట్టాడు.
తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సాంకేతిక కారణాల దృష్ట్యా అక్కడ ‘జీరో’ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అత్తాపూర్‌లోని నిందితుడి ఇంటికి వెళ్లగా అప్పటికే ఇల్లు తాళం వేసి ఉంది. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలు, లొకేషన్ సాయంతో పారిపోతున్న సూర్యాభాయ్‌ను ఛేజ్ చేసి పట్టుకున్నారు. కింగ్‌కోఠి ఆసుపత్రిలో నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కాగా, కోర్టు ఆవరణలో నిందితుడు సూర్యాభాయ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరినీ మోసం చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని, చివరకు న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
