Pawan Kalyan 

Pawan Kalyan: కేవలం ‘బటన్’ నొక్కితే సరిపోదు.. రోడ్లు, హాస్పిటల్స్ ఏవి?:

Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాల గురించి మేధావులతో వాల్యూమ్స్ కొద్దీ పుస్తకాలు రాయించవచ్చని, కానీ సిద్ధాంతం అనేది క్షేత్రస్థాయిలోని సామాన్య కార్యకర్తకు సైతం అర్థమయ్యేలా ఒకే ఒక్క సరళమైన వాక్యంలో ఉండాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కులాల ఐక్యత గురించి ఉదాహరణగా చెప్తూ, బట్టలు కుట్టే టైలర్ శివనాగరాజు లాంటి సామాన్యుడికి ఉన్న అవగాహన మిగతా వారికి ఉందో లేదో తనకు తెలియదన్నారు.

ఎందుకంటే బట్టలు కుట్టేటప్పుడు ఏ కులం వాడికి కుడుతున్నామా అని ఎవరూ ఆలోచించరని, అంత సింపుల్‌గా చూస్తేనే సమాజం బాగుంటుందని చెప్పారు. తాను కులాల ఐక్యత గురించి మాట్లాడుతుంటే వైఎస్సార్‌సీపీ నాయకులు మాత్రం తానేదో కుల రాజకీయం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. తానే గనుక ఒక్క కులం కోసమే పనిచేసే వ్యక్తినైతే, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకులు జనసేనలోకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ఈ వ్యక్తి అందరి కోసం నిలబడతాడనే నమ్మకంతోనే వారు తన వద్దకు వచ్చారని స్పష్టం చేశారు.

వ్యక్తిగతంగా తనకు వైఎస్సార్‌సీపీ నేతలతో ఎలాంటి శత్రుత్వం లేదా కోపాలు లేవని, కేవలం వారి విధివిధానాల మీదే తనకు విసుగు ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాము ఏదైనా పాలసీ (విధానాల) గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎదుటివారు వ్యక్తిగత జీవితాలను హననం చేస్తూ పర్సనల్ ఎటాక్‌లు చేస్తున్నారని మండిపడ్డారు.

కొన్నిసార్లు తాము మౌనంగా ఉంటే వారు మరీ రెచ్చిపోతున్నారని, అందుకే ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టే తాము కూడా అంతే దీటుగా సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు. జనసేన నేత పంతం నానాజీ మాట్లాడిన మాటలపై కొందరు విమర్శలు చేస్తున్నారని, కానీ గతంలో వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేలు తనను ఎంత దారుణంగా దూషించారో తామేమీ మర్చిపోలేదని గుర్తుచేశారు.

అధికారం ఉన్నప్పుడే కాకుండా, ఇప్పుడు కేవలం 11 సీట్లు వచ్చినా కూడా ఆ పార్టీ నేతలు తగ్గకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారి కమిట్‌మెంట్‌ను చూసి తాము కూడా నేర్చుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి కూడా అసభ్యంగా మాట్లాడిన వారు.. ఇప్పుడు సడన్‌గా రియలైజ్ అయిపోయినట్లు మాట్లాడుతున్నారని, వారి రియలైజేషన్ ఎంతో కాలం ఉండదన్నారు.

వైఎస్సార్‌సీపీ నేతలు తిట్టడం మానేస్తే తాము తమ పార్టీ నాయకులైన శివ, మునీర్ హసన్‌ల గురించి మాట్లాడుకుంటూ పార్టీని నిర్మించుకుంటామని.. లేదు తిడతామన్నా కూడా వారిని తిట్టి అయినా సరే జనసేన బలపడటం ఖాయమని, ఛాయిస్ వారిదేనని తేల్చిచెప్పారు.

గతంలో హుదూహుద్ తుఫాన్ సమయంలో తాను శ్రీకాకుళం పర్యటిస్తున్నప్పుడు, ఒక 22 ఏళ్ల యువకుడు తనకు 10 కేజీల ఉచిత బియ్యం వద్దని, బదులుగా 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలని అడిగిన ఉదాహరణను పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. యువత కేవలం ఉచితాలను కోరుకోవడం లేదని, నిరుద్యోగులకు సరైన ఉపాధి, జీవనోపాధి కావాలని అడుగుతున్నారని చెప్పారు.

సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు ఉచితాలు లేదా వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా అవసరమని.. అందుకే తమ కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల పెన్షన్‌ను ఏకంగా రూ.10,000 కు పెంచామని, జనసేన ఎప్పుడూ సంక్షేమానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే కేవలం బటన్ నొక్కేసి అకౌంట్లలో డబ్బులు వేసేస్తేనే ఓట్లు పడవనడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పతనమే క్లాసిక్ ఎగ్జాంపుల్ అని విమర్శించారు. గత ప్రభుత్వం బటన్ నొక్కడం మీదున్న శ్రద్ధను హాస్పిటల్స్, స్కూల్స్, రోడ్ల లాంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల (Infrastructure) పై పెట్టలేదని దుయ్యబట్టారు.

గవర్నమెంట్ హాస్పిటల్స్ అధ్వాన్నంగా మారడం వల్లే పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని.. తమిళనాడు, పాండిచ్చేరి తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక ఎంఆర్ఐ స్కాన్ మిషన్ ఇస్తే దాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితి ఉందని, డాక్టర్లకు సరైన జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను మార్చేందుకు తపన పడుతున్నామని చెప్పారు.

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారితో మాట్లాడినప్పుడు, జలజీవన్ మిషన్ (JJM) అనేది కేంద్రానిది మాత్రమే కాదు, ప్రజలకు నీళ్లివ్వాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని చర్చించామన్నారు. అందుకే భవిష్యత్ నాయకులుగా ఎదగబోయే జనసైనికులు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూనే, బడ్జెట్‌ను దేనికి కేటాయించాలనే మౌలిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

గత ఏడాది విశాఖపట్నంలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో తాను ‘మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్’ అని నినాదం ఇచ్చానని, దానికి అనుగుణంగానే నేడు పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని జనసేనాని వెల్లడించారు. జనసేనలోని ప్రతి సభ్యుడు ఒక భావజాలం కోసం నడుం బిగించి ముందుకు వెళ్లే ఒక ఉద్యమి కావాలని ఆకాంక్షించారు.

పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి కొత్త మెంబర్‌షిప్‌లు చేయించే మొదటి స్థాయి నాయకుడే ‘సాధక్’ అని, ఈరోజు సభలో ఉన్న 700 మంది కమిటీ సభ్యుల్లో 600 మందికి పైగా సాధకులు ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మందితో సభ్యత్వం చేయించడానికి 18,000 మంది సాధకులు నిరంతరం శ్రమించారని, వారంతా సభ్యత్వ నమోదు ద్వారా క్షేత్రస్థాయిలో తమ నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని కొనియాడారు.

గతంలో కొంతమంది సీనియర్ నాయకులకు పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే వారు ముందుకు తీసుకెళ్లలేకపోయారని.. అందుకే తెనాలి లాంటి చిన్న టౌన్‌లో ఉదయం టైలరింగ్ చేసుకుంటూ సాయంత్రం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే ‘శివ’ లాంటి సామాన్యులను గుర్తించి తానే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభించానని చెప్పారు. తనను చుట్టుపక్కల ఉన్నవారు ఓపికగా అర్థం చేసుకుని, తాను చెప్పిన గైడ్లైన్స్ తూచా తప్పకుండా పాటించి ఉంటే ఈపాటికి జనసేనకు 22 లక్షలు కాదు, కోటి మంది సభ్యులు ఉండేవారని అభిప్రాయపడ్డారు.

ప్రతి చిన్న వీదురు గాలికి కొట్టుకుపోయే పెద్ద సమూహం కంటే, నిలబడే గంగిగోవు పాలు లాంటి నిబద్ధత గల సైన్యమే తనకు ముఖ్యమన్నారు. ఈ 18,000 మంది సాధకులను సరిగ్గా గైడ్ చేస్తే అదొక బలమైన ఆర్మీలా మారుతుందని, తన గోల్ అంతా ఈ 18,000 మందిని వ్యక్తిగతంగా కలవడమేనని తెలిపారు. ఈ కమిటీల ఎంపికపై కొందరు నాయకులు మెసేజ్‌లు పంపుతూ తమకు నచ్చిన వారికే పదవులు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారని.. కానీ ఈ కమిటీల ప్రధాన బాధ్యత లీడర్లను ఎంపిక చేయడం కాదు, కేవలం క్షేత్రస్థాయిలో కష్టపడిన వారి వివరాలను అత్యంత పారదర్శకంగా సేకరించి తన ఆఫీస్‌కు పంపించడమేనని స్పష్టం చేశారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో ఈ సమాచార సేకరణ కమిటీ పనిచేస్తుందని, ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ముగ్గురు సీనియర్ సాధకులు, 21 మంది సాధకులు ఉంటారని.. ఈ సమాచారం మిస్ అవ్వకుండా తన ప్రెసిడెంట్ సెక్రటేరియట్ నుంచి ఐదుగురు సభ్యుల సపోర్ట్ టీమ్‌ను కూడా పంపిస్తున్నట్లు వివరించారు.

తాను ఎప్పుడూ కులం కార్డును వాడుకుని రాజకీయం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయనని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రం, దేశం బాగుండాలని, మానవత్వం చచ్చిపోకూడదనే మూడు సూత్రాలపైనే తన రాజకీయం నడుస్తుందన్నారు. కులం అనేది కేవలం ఇంటి గడప లోపల మాత్రమే ఆగిపోవాలని, గడప దాటితే భాష, సంస్కృతి, ధర్మం ముఖ్యమని, ఇంకో పది అడుగులు వేస్తే దేశం, మానవత్వమే గుర్తుండాలని ఆకాంక్షించారు. మిగతా వారు దిగజారుడు రాజకీయం చేస్తున్నందు వల్లే తాను ఆ తప్పులను కరెక్ట్ చేయడానికి కులాల గురించి మాట్లాడాల్సి వస్తోందన్నారు.

భారతదేశంలో బహుజన సమాజ పార్టీ (BSP) కాన్షీరామ్ గారి నేతృత్వంలో సామాజిక న్యాయం కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించి, లక్షలాది మందికి బలమైన గళంగా మారిందని కొనియాడారు. అయితే ఏ ఉద్యమమైనా కేవలం ఒకే ఒక్క సామాజిక వర్గానికి పరిమితమై, సంస్థాగత నిర్మాణాన్ని నిర్మించకపోతే దానికి పరిమితులు ఏర్పడతాయనే పాఠాన్ని కూడా బీఎస్పీ నేర్పిందన్నారు. అందుకే ఒక నాయకుడు కేవలం తన కులాన్ని మాత్రమే నమ్మితే సరిపోదని, సమాజంలోని అన్ని కులాలను, దేశాన్ని నమ్మినప్పుడే నిజమైన సాధికారత వస్తుందని చెప్పారు.

కొన్ని మూడు నాలుగు కులాలను కలిపేసి అధికారాన్ని పంచుకుంటే అది కేవలం ‘పొలిటికల్ విక్టరీ’ (రాజకీయ విజయం) మాత్రమే అవుతుందని, కానీ జనసేన ఆశిస్తున్నది అన్ని వర్గాలకు భద్రతను ఇచ్చే ‘సోషల్ విక్టరీ’ (సామాజిక విజయం) అని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అనేది ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ కాదు, అదొక గ్రూపు అని.. అధికారం కోసం వారు కులాన్ని, మతాన్ని దేన్నైనా వాడుకుంటారని విమర్శించారు. గతంలో ఆ పార్టీలో పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను లాంటి వారు ఎప్పుడూ తనను దిగజారి తిట్టలేదని, లాయల్టీని దాటుకుని వారు జనసేనలోకి వచ్చారంటే ఈ విచ్ఛిన్నకర రాజకీయం నచ్చకేనని అర్థం చేసుకోవాలన్నారు.

చిత్రంగా తనను తిట్టేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు కాపు నాయకులనే వాడుకుంటున్నారని.. ఒక పథకం ప్రకారం, జనసేన అంటే ఇష్టపడని శక్తులు కాపు నాయకుల చేతనే తనను తిట్టిస్తూ, సమాజంలో ఆ కులంపై ఒక నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలని పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారని, తాను ఆ స్ట్రాటజీని బ్రేక్ చేస్తానని హెచ్చరించారు.

కృష్ణలంక లాకప్ డెత్ ఘటన (సాయికృష్ణ ఘటన) ను ప్రస్తావిస్తూ.. ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ చేసిన తప్పుకు కులం రంగు పులిమి, వాడు మా కులం వాడు కాబట్టి వెనకేసుకొస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మీ నాయకుడి మాటలు మీ కులానికి గౌరవాన్ని పెంచుతున్నాయో, లేక సమాజంలో మీకున్న ఇంప్రెషన్‌ను దెబ్బతీస్తున్నాయో ప్రతి కుల పెద్దలు ఆలోచించుకోవాలన్నారు. బూతులు తిట్టే వాళ్లను నమ్మారు కాబట్టే వైఎస్సార్‌సీపీ 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయిందని ఎద్దేవా చేశారు.

ఈ సమాచార సేకరణ కమిటీల ద్వారా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లీడర్‌షిప్ తయారుకాబోతోందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవస్థలను బలోపేతం చేయాలంటే బలమైన వ్యక్తులు కావాలని, బలహీనుల చేతుల్లో పెడితే వ్యవస్థలు వీగిపోతాయన్నారు. ఈ కమిటీలలో ఒక ఆటో డ్రైవర్, టీ షాప్ నడిపే వ్యక్తి, గృహిణులు, రోజువారీ కూలీలు లాంటి నిస్వార్థంగా శ్రమించిన జనసైనికులు, వీర మహిళలు ఉన్నారని.. ఇది కేవలం వ్యక్తులను చూసి వేసిన కమిటీలు కావని, కష్టాన్ని చూసి వేసినవని స్పష్టం చేశారు. ఈరోజు జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు మంత్రులతో పాటు 3,500 నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో 3,000 మంది ప్రతిప్రతినిధులు ఉన్నారంటే దానికి కారణం కార్యకర్తల త్యాగమేనని కొనియాడారు.

ఆ త్యాగానికి సంస్థాగత గుర్తింపు ఇచ్చేందుకే ఈ రూల్ బుక్ లాంటి ప్రోఫార్మాను సిద్ధం చేశామని, ఇందులో ఎవరు ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నారు, ఏయే ఉద్యమాల్లో పాల్గొన్నారు, వారి సమర్థత ఏంటి అనే వివరాలను సేకరించి కలెక్టివ్‌గా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. జనసేనలో కార్యకర్తలకు, తనకు మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని వివరిస్తూ.. అభిమానం అనేది ఒక పక్షిని గుప్పిట్లో బంధించి నలిపేసేలా ఉండకూడదని, ఒక మొక్కను ఎదుగనివ్వకుండా రాళ్లు కడితే అది బోన్సాయిలా ఉండిపోతుందని..

జనసేన అనే మహా వృక్షాన్ని స్వేచ్ఛగా ఎదగనిస్తే ఆ కొమ్మల నీడన మీరందరూ కూర్చోవచ్చని పిలుపునిచ్చారు. 18,000 మంది సాధకులు తమతమ ఏరియాల్లో లీడర్లుగా బాధ్యత తీసుకుని, మాటల్లో తూకం పాటిస్తూ, కచ్చితమైన అనాలసిస్‌తో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. చివరగా, సభలో అందరూ క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారం నిలబడాలని సూచిస్తూ, ఉమ్మడిగా జాతీయ గీతాన్ని (జనగణమన) ఆలపించడంతో సమావేశాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *