Chandrababu

Chandrababu: జూలై చివరికి వెలిగొండ ఫేజ్-1 నీళ్లు.. ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం.. గొడ్డలి పార్టీపై సీఎం ఫైర్!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన రాయలసీమ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాలను తీర్చే వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూనే, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఒకప్పుడు తీవ్ర కరువుతో అల్లాడిన మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తాయని ఇక్కడి ప్రజలు ఎన్నడూ ఊహించలేదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ వెనుకబడిన ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ‘వెలిగొండ ప్రాజెక్టు’ను తలపెట్టారని, తాను ఎప్పుడు కలిసినా ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ గురించే అడిగేవారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా 1996 మార్చిలో తానే ఈ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి భూములిచ్చిన రైతుల త్యాగాలు ఎంతో గొప్పవని కొనియాడిన సీఎం.. వారి త్యాగం వృథా పోనివ్వమని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా 2,350 మంది నిర్వాసితుల కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద రూ.300 కోట్లు కేటాయించి పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు.

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, 1,650 గ్రామాలకు తాగునీరు అందుతుందని చంద్రబాబు వివరించారు. రాబోయే జూలై చివరి నాటికి ఫేజ్-1 ద్వారా నీరందిస్తామని కాలపరిమితిని ప్రకటించారు. ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఈ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతంలో సుంకేశుల గ్యాప్ పనులను కూడా తామే 1998లో ప్రారంభించామని, గతంలో తాము ఇచ్చిన హామీ మేరకు మార్కాపురానికి జిల్లా హోదాను కల్పించామని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వచ్చాక అక్కడ భూముల ధరలు ఎలా పెరిగాయో, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక ఇక్కడి రైతుల భూములకు కూడా అదే స్థాయిలో డిమాండ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి నక్సలిజం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో గతంలో తాము ఎన్నో కఠిన చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడామన్నారు.

ఇదే వేదికపై నుంచి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని ‘గొడ్డలి పార్టీ’గా సంబోధిస్తూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల వైసీపీ తుగ్లక్ పాలనలో రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైందని, ఏకంగా రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినప్పటికీ ఆ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ నేతలు దిట్టలని, వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ ప్రజలను ఘోరంగా వంచించారని విమర్శించారు. టన్నెల్-2 (రెండో సొరంగం) లో పెద్ద బోరు మిషన్ ఇరుక్కుపోయి పనులు ఆగిపోయినప్పటికీ, కనీసం దాన్ని తీయకుండా, ప్రాజెక్టు పూర్తి కాకుండానే గత ప్రభుత్వం దొంగ ప్రారంభోత్సవాలు కానిచ్చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా తమలాగే బాధ్యతగా పనిచేసుంటే ఈపాటికి పరిస్థితి మరోలా ఉండేదన్నారు.

కాగా, మార్కాపురం పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు గిద్దలూరు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘సంజీవని’ ఆరోగ్య పథకం కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో సంజీవని పథకం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాబోయే ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ సంజీవని పథకాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *